సుందర్‌‌పై కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసల వర్షం

7 Mar, 2021 21:45 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి టెస్టులో టీమిండియా ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌ తొలి ఇన్నింగ్స్‌లో అజేయమైన 96 పరుగులు సాధించడంతో అతనిపై అభినందలు వెల్లువెత్తుతున్నాయి. జట్టు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు అతను ప్రదర్శించిన పరిణితిని టీమిండియా మాజీలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి అయితే సుందర్‌ను తనతోనే పోల్చుకుంటూ ఆకాశానికెత్తేశాడు. సుందర్‌ తనకంటే బాగా రాణించగల సమర్ధుడని, ఆ సత్తా సుందర్‌ వద్ద ఉందని ఇదివరకే నిరూపితమైందని పేర్కొన్నాడు. సుందర్‌ తన బౌలిం‍గ్‌పై ఇంకా దృష్టి సారించాల్సి ఉందని ఆయన సూచించాడు. అతను బౌలర్‌గా కూడా రాణించగలిగితే ఆల్‌రౌండర్‌ ఖాతాలో జట్టులో స్థానానికి ఢోకా ఉండదని పేర్కొన్నాడు. 

జట్టు ఓ ఆల్‌రౌండర్‌ నుంచి కనీసం 50 పరుగులను, 20కు పైబడి ఓవర్లు వేయాలని ఆశిస్తుంది. ప్రస్తుత ఆల్‌రౌండర్లలో సుందర్‌ ఆ పాత్రను సమర్ధవంతంగా పోశిస్తున్నాడని కితాబునిచ్చాడు. ఎడమ చేతి బ్యాటింగ్‌, కుడి చేతి ఆఫ్‌ బ్రేక్‌ బౌలింగ్‌ వేసే సుందర్‌.. ఇటీవల జరిగిన నాలుగు టెస్ట్‌ల్లో మూడు అర్ధశతకాలు, 6 వికెట్లు పడగొట్టాడు. కీలకమైన ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న సుందర్‌ అప్పట్లో రవిశాస్త్రి తరహాలోనే బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణిస్తున్నాడు. కాగా, 80 దశకంలో భారత టెస్ట్‌ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న రవిశాస్త్రి.. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదరగొట్టేవాడు. భారత్‌ తరఫున 80 టెస్ట్‌లకు ప్రాతినిధ్యం వహించిన రవిశాస్త్రి.. 11 శతకాలు, 12 అర్ధ శతకాల సాయంతో 3830 పరుగులు, 151 వికెట్లు సాధించాడు.  

మరిన్ని వార్తలు