Ravindra jadeja: రోహిత్‌, జడేజా చెప్పే చేశారు! అదేదో అంపైర్‌ ముందు చేయొచ్చు కదా! క్లీన్‌చిట్‌ ఇచ్చాక..

10 Feb, 2023 11:21 IST|Sakshi
చర్చకు దారి తీసిన ఘటన (PC: Twitter)

India vs Australia, 1st Test: ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా టీమిండియా స్టార్‌ రవీంద్ర జడేజా బౌలింగ్‌ చేసే క్రమంలో తన చేతికి ఏదో రాసుకున్నట్లు కన్పించడంపై క్రీడా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఐదు వికెట్లతో ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించిన జడ్డూ.. కొంపదీసి మోసానికి పాల్పడ్డాడా అంటూ కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి ఇప్పటికే కంగారూ జట్టు మాజీ సారథి టిమ్‌ పైన్‌ స్పందించిన సంగతి తెలిసిందే.

‘‘ఇదేదో కాస్త ఆసక్తికరంగా ఉంది’’ అని అతడు కామెంట్‌ చేశాడు. కాగా ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో 16వ ఓవర్‌ వేసే క్రమంలో.. బౌలింగ్‌ వేయడానికి ముందు సిరాజ్‌ వద్దకు వెళ్లగా అతడు.. జడ్డూ చేతికి లోషన్‌ లాంటిది అందించినట్లు కనిపించింది. అది తీసుకున్న జడేజా.. తన ఎడమచేతి చూపుడు వేలికి రుద్దుకున్నాడు.

అయితే, అప్పటికే జడేజా 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి జోరు మీదున్న తరుణంలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. ఇక నెటిజన్లు లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జడ్డూ చేసిన పనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ చర్చోపర్చలు చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో అసలేం జరిగిందన్న అంశంపై తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. జడేజా తన వేలికి ఆయింట్‌మెంట్‌ రాసుకున్నట్లు తెలుస్తోంది. జడేజాకు సంబంధించిన వీడియో చూసిన నేపథ్యంలో మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా జడేజాను ఈ విషయం గురించి ఆరా తీసినట్లు సమాచారం.

దీంతో టీమిండియా మేనేజ్‌మెంట్‌, కెప్టెన్‌.. వేలి నొప్పి నుంచి ఉపశమనం కోసమే జడేజా సదరు ఆయింట్‌మెంట్‌ వాడాడని అతడికి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, క్రిక్‌ఇన్ఫో కథనంలో మాత్రం.. మ్యాచ్‌ రిఫరీకి చెప్పిన తర్వాతే.. జడేజా ఆ ఆయింట్‌మెంట్‌ రాసుకున్నట్లు పేర్కొంది. రిఫరీ జడ్డూకు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు తెలిపింది.

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా మరో మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ సైతం జడేజా వివాదంపై స్పందించాడు. ‘‘అతడు చాలా సేపు బౌలింగ్‌ చేశాడు. కాబట్టి వేలికి బొబ్బలు వచ్చినట్లున్నాయి. తను ఆయింట్‌మెంట్‌ రాసుకోవడంలో తప్పులేదు.

అయితే, అంపైర్‌ దగ్గరికి వెళ్లి అతడికి బాల్‌ అందించి.. అతడి కళ్ల ముందే ఈ పని చేస్తే బాగుండేది. అప్పుడు ఇంతగా చర్చ జరిగి ఉండేదే కాదు’’ అని అభిప్రాయపడ్డాడు. బిగ్‌ స్పోర్ట్స్'‌ బ్రేక్‌ఫాస్ట్‌ షోలో ఈ మేరకు క్లార్క్‌ వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: IND Vs AUS: ఈజీ క్యాచ్‌ ఇచ్చిన రాహుల్‌.. కోపంతో ఊగిపోయిన రోహిత్‌ శర్మ! వీడియో వైరల్‌
Womens T20 WC: ధనాధన్‌ ఆటకు అమ్మాయిలు సిద్ధం.. హర్మన్‌ప్రీత్ సేన ఈసారైనా...!

మరిన్ని వార్తలు