సకుటుంబ సమేతంగా...

9 May, 2021 03:59 IST|Sakshi

ఇంగ్లండ్‌ పర్యటనకు భారత క్రికెటర్లు

సుదీర్ఘ పర్యటన నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయం

జూన్‌ 2న బయలుదేరనున్న టీమిండియా

ముంబై: సుమారు మూడున్నర నెలల సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటన కోసం భారత క్రికెట్‌ జట్టు జూన్‌ 2న బయలుదేరనుంది. దానికి ముందు ముంబైలో ఆటగాళ్లంతా ఎనిమిది రోజులపాటు ‘హార్డ్‌ క్వారంటైన్‌’లో ఉంటారు. ఇంగ్లండ్‌ చేరిన తర్వాత పది రోజులు తమను ‘సాఫ్ట్‌ క్వారంటైన్‌’కు అనుమతించాలని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)కి విజ్ఞప్తి చేయనున్న బీసీసీఐ... దీనిపై ఇంకా చర్చలు కొనసాగిస్తోంది. హార్డ్‌ క్వారంటైన్‌లో ఆటగాళ్లు పూర్తిగా తమ హోటల్‌ గదులకే పరిమితం కావాల్సి ఉంటుంది. సహచర ఆటగాళ్లను కూడా కలిసేందుకు వీలుండదు.

సాఫ్ట్‌ క్వారంటైన్‌లో ఆటగాళ్లంతా కలిసి సాధన చేసుకునేందుకు (ఆస్ట్రేలియా సిరీస్‌ తరహాలో) అవకాశం ఉంటుంది. ‘భారత్‌లోనే మనవాళ్లు హార్డ్‌ క్వారంటైన్‌లో ఉండబోతున్నారు. రెండో, నాలుగో, ఏడో రోజుల్లో ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలితేనే వారిని విమానం ఎక్కనిస్తాం. ఇలా అయితే బబుల్‌లోంచి మరో బబుల్‌లోకి ప్రవేశిస్తాం కాబట్టి క్వారంటైన్‌ రోజులను తగ్గించే విషయంపై కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఎలాగూ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ మ్యాచ్‌ వేదిక అయిన ఏజియన్‌ బౌల్‌లో భాగంగానే హోటల్‌ హిల్టన్‌ ఉంది కాబట్టి సమస్య లేదు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

క్వారంటైన్‌ ముగిసిన తర్వాతే జూన్‌ 13 నుంచి క్రికెటర్లు బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. మరోవైపు సుదీర్ఘ పర్యటన కాబట్టి క్రికెటర్ల కుటుంబ సభ్యులను అనుమతించాలని బోర్డు నిర్ణయించింది. అయితే జూన్‌ 18 నుంచి జరిగే  డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందునుంచే ఆటగాళ్ల భార్యాపిల్లలను అనుమతిస్తారా లేక ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు మాత్రమే వారిని అనుమతిస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు సౌరవ్‌ గంగూలీ, జై షా హాజరయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో మిగిలిన 31 మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో ఈసీబీతో వీరిద్దరు చర్చించే అవకాశం కూడా ఉంది.

శ్రీలంకలో అవకాశం ఉందా?
ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహించేందుకు గత ఏడాది కూడా తీవ్రంగా ప్రయత్నించి శ్రీలంక క్రికెట్‌ బోర్డు విఫలమైంది. ఈసారైనా మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించాలని ఆసక్తిగా ఉంది. అధికారికంగా బీసీసీఐకి ఇంకా ఎలాంటి విజ్ఞప్తి చేయకపోయినా... బోర్డు మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ అర్జున డిసిల్వా మాత్రం తాము సెప్టెంబర్‌లో నిర్వహించగలమని నమ్మకంగా చెబుతున్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో లీగ్‌ టోర్నీ నిర్వహణకు అవసరమైన ఫ్లడ్‌లైటింగ్‌తో నాలుగు మైదానాలు (ఖెట్టరమా, పల్లెకెలె, సూర్యవేవా, దంబుల్లా) అందుబాటులో ఉన్నాయి. అయితే అనూహ్యంగా ఇటీవలే లంకలో కూడా కరోనా కేసులు పెరుగుతుండటం ప్రతికూలాంశం. నెలరోజుల క్రితం అక్కడ రోజుకు 300 కేసులు రాగా... ఇప్పుడు రోజుకు 2 వేల కేసులు నమోదవుతున్నాయి.

ఇంగ్లండ్‌లో నిర్వహించండి: పీటర్సన్‌
ఐపీఎల్‌–2021లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించడంకంటే ఇంగ్లండ్‌ సరైన వేదిక అని ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ అభిప్రాయపడ్డాడు. ‘సెప్టెంబర్‌ చివర్లో ఐపీఎల్‌ నిర్వహించేందుకు యూఏఈ సరైన వేదిక అని చాలా మంది చెబుతున్నారు. కానీ ఆ సమయంలో ఇంగ్లండ్‌లో వాతావరణం చాలా బాగుంటుంది. మాంచెస్టర్, లీడ్స్, బర్మింగ్‌హామ్, లార్డ్స్, ఓవల్‌ మైదానాలను ఉపయోగించుకోవచ్చు. ప్రేక్షకులను కూడా అనుమతిస్తే అద్భుతంగా ఉంటుంది. ఐపీఎల్‌ ఇప్పటికే యూఏఈ, దక్షిణాఫ్రికాలలో జరిగింది కాబట్టి ఈసారి ఇంగ్లండ్‌లో నిర్వహిస్తే బాగుంటుంది. ఒక్కసారి భారత్, ఇంగ్లండ్‌ సిరీస్‌ ముగిసిందంటే అగ్రశ్రేణి ఆటగాళ్లంతా అక్కడే అందుబాటులో ఉంటారు కూడా’ అని పీటర్సన్‌ విశ్లేషించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు