WTC Final: టీమిండియా కొత్త జెర్సీల ఆవిష్కరణ

1 Jun, 2023 20:15 IST|Sakshi

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌కు ఆరు రోజుల ముందు టీమిండియా కొత్త జెర్సీ విడుదలైంది. భారత జట్టు అఫిషియల్‌ కిట్ స్పాన్సర్ అడిడాస్‌ సంస్థనే  టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా కూడా వ్యవహరించింది. నైక్ కంపెనీ తర్వాత కిట్ స్పాన్సరే (అడిడాస్‌) జెర్సీని తయారు చేయడం ఇదే మొదటిసారి. మూడు ఫార్మట్లకు చెందిన భారత జట్టు జెర్సీలను అడిడాస్‌ సంస్థ ఇవాళ (జూన్‌ 1) సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ఆవిష్కరించి, అభిమానులతో షేర్‌ చేసుకుంది. 

జెర్సీల ఆవిష్కరణకు సంబంధించి రూపొందించిన ప్రత్యేక యానిమేటెడ్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తుంది. కొత్త జెర్సీలను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. టీమిండియా కొత్త జెర్సీలు బాగున్నాయంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరేమో పాత జెర్సీలకు కొత్త వాటికి తేడా లేదని పెదవి విరుస్తున్నారు. కాలర్‌ లేకుండా డార్క్‌ బ్లూ కలర్‌లో ఉండే జెర్సీ టీ20లకు.. లైట్‌ బ్లూ కలర్‌లో కాలర్‌తో ఉన్న జెర్సీని వన్డేలకు.. వైట్‌ కలర్‌ జెర్సీని టెస్ట్‌లకు టీమిండియా ఆటగాళ్లు ధరించనున్నారు. 

ఇదిలా ఉంటే, జూన్ 7న ఆసీస్‌తో ప్రారంభంకాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఈ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. పురుషుల క్రికెట్‌తో పాటు మహిళల క్రికెట్‌లోనూ భారత ఆటగాళ్లు ఇవే జెర్సీలు ధరించనున్నారు. బైజూస్ సంస్థ బీసీసీఐతో ఉన్న కాంట్రాక్ట్‌ను (జెర్సీ స్పాన్సర్‌) అర్ధంతరంగా రద్దు చేసుకోవడంతో అడిడాస్‌ కంపెనీ తప్పనిసరి పరిస్థితుల్లో జెర్సీ స్పాన్సర్‌గా కూడా వ్యవహరించింది.ఔ

చదవండి: WTC Final: ఆసీస్‌కు అక్కడ అంత సీన్‌ లేదు.. గెలుపు టీమిండియాదే..!

మరిన్ని వార్తలు