టీమిండియా క్రికెటర్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు

25 Jan, 2023 19:17 IST|Sakshi

ICC Womens Emerging Cricketer Of The Year 2022: భారత స్టార్‌ మహిళా క్రికెటర్‌ రేణుకా సింగ్‌ ఠాకూర్‌కు ఐసీసీ అత్యున్నత పురస్కారం లభించింది. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొడుతున్న ఈ సిమ్లా (హిమాచల్‌ ప్రదేశ్‌) అమ్మాయి.. ఐసీసీ వుమెన్స్‌ ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2022 అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని ఐసీసీ వరల్డ్‌ గవర్నింగ్‌ బాడీ ఇవాళ (జనవరి 25) ప్రకటించింది.

26 ఏళ్ల రైట్‌ ఆర్మ్‌ మీడియం పేస్‌ బౌలర్‌ అయిన రేణుకా.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి రెండేళ్లకే ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకుంది. రేసులో ఆస్ట్రేలియాకు చెందిన డార్సీ బ్రౌన్, ఇంగ్లండ్ ప్లేయర్‌ అలైస్ క్యాప్సీ, సహచర క్రికెటర్ యష్తిక భాటియా పోటీపడినప్పటికీ.. రేణుకానే ఈ అవార్డు వరించింది.

రేణుకా టీమిండియా తరఫున ఇప్పటివరకు 7 వన్డేలు, 25 టీ20 మ్యాచ్‌లు ఆడి మొత్తంగా 41 వికెట్లు (వన్డేల్లో 18, టీ20ల్లో 23) పడగొట్టింది. ఝులన్‌ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆమె లేని లోటును భర్తీ చేస్తున్న రేణుకా.. గతేడాది కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ ప్రదర్శన తర్వాత రాత్రికిరాత్రి స్టార్‌ అయిపోయింది. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చిన రేణుకా 4 కీలక వికెట్లు తీసి ఆసీస్‌ వెన్ను విరిచింది. రేణుకా స్పెల్‌లో ఏకంగా 16 డాట్‌ బాల్స్‌ ఉండటం విశేషం.  


 

మరిన్ని వార్తలు