IND Vs AUS 2nd Test Prediction: సూర్య స్థానంలో అయ్యర్‌.. గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తు ఖరారు

16 Feb, 2023 21:50 IST|Sakshi

ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియాల మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు జరగనుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 132 పరుగులతో ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా అదే ఫలితాన్ని ఢిల్లీలోనూ రిపీట్‌ చేయాలని చూస్తోంది. ఇక రెండో టెస్టుకు టీమిండియా తుది జట్టులో శ్రేయాస్‌ అయ్యర్‌ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఫిట్‌నెస్‌ నిరూపించుకొని జట్టుతో చేరిన అయ్యర్‌.. తొలి టెస్టులో ఆడిన సూర్యకుమార్‌ స్థానంలో బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

అయితే తొలి టెస్టులో విఫలమైన కేఎల్‌ రాహుల్‌కు మరో అవకాశం ఇవ్వాలనే యోచనలో మేనేజ్‌మెంట్‌ ఉన్నట్లు తెలిసింది. దీంతో ఇన్‌ఫామ్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఓపెనర్లుగా రోహిత్‌, రాహుల్‌లు మరోసారి రానున్నారు. ఇక వన్‌డౌన్‌లో రానున్న టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారాకు ఈ టెస్టు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆసీస్‌తో రెండో టెస్టు పుజారాకు వందోది కానుంది.

టీమిండియా తరపున టెస్టుల్లో 100 మ్యాచ్‌లు ఆడిన 13వ క్రికెటర్‌గా పుజారా చరిత్రకెక్కనున్నాడు. తన వందో టెస్టులో శతకం చేయాలని పుజారా ఉవ్విళ్లూరుతున్నాడు. నాలుగో స్థానంలో కోహ్లి రానున్నాడు. కింగ్‌ కోహ్లి నుంచి భారీ ఇన్నింగ్స్‌ బాకీ ఉంది. ఇక రెండు నెలల తర్వాత జట్టులోకి రానున్న శ్రేయాస్‌ అయ్యర్‌ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఆల్‌రౌండర్లు.. స్పిన్‌ త్రయం జడేజా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌లు ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటితే ఆసీస్‌కు కష్టాలు తప్పవు. పేసర్లు షమీ, సిరాజ్‌ తమ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నారు.

ఇక ఢిల్లీ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని క్యురేటర్‌ ఇప్పటికే వెల్లడించాడు. కాగా ఇదే పిచ్‌పై భారత స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్ల ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. టాస్‌ గెలిచిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది. ఢిల్లీ స్టేడియం టీమిండియాకు కంచుకోట. దాదాపు మూడు దశాబ్దాలుగా టీమిండియాకు ఓటమనేది లేదు.గత 36 ఏళ్లలో కేవలం రెండు టెస్టులు మాత్రమే  డ్రా ముగిశాయి. ఇదే వేదికపై ఇంగ్లండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ వంటి మేటి జట్లను భారత్‌ చిత్తు చేసింది. చివరగా 1987లో వెస్టిండీస్‌ జట్టు ఈ వేదికలో ఓడించింది.

ఈ వేదికలో ఇప్పటివరకు 36 టెస్టు మ్యాచ్‌లు జరగ్గా.. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 6 సందర్భాల్లో విజయం సాధించగా, సెకెండ్‌ బ్యాటింగ్‌ జట్టు 13 సార్లు గెలిపొందింది. మిగితా 17 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇ‍క ఓవరాల్‌గా భారత్‌ 34 టెస్టులు ఆడగా.. అందులో 13 మ్యాచ్‌లు గెలుపొందింది.  6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇక ఢిల్లీ గడ్డపై ఆసీస్ రికార్డును పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 7 మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒకటి మాత్రమే గెలిచింది.

భారత తుది జట్టు(అంచనా): రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, చతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, శ్రీకర్‌ భరత్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌

చదవండి: 'క్షమించండి'.. ఇలా అయితే ఎలా పెద్దన్న!

స్టన్నింగ్‌ క్యాచ్‌.. అద్భుత విన్యాసానికి హ్యాట్సాఫ్‌

మరిన్ని వార్తలు