చైనాకు భారత్‌ షాక్‌ 

24 Aug, 2020 03:09 IST|Sakshi

ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో క్వార్టర్స్‌లోకి టీమిండియా

లీగ్‌ దశలో అజేయ రికార్డు

చెన్నై: సీనియర్‌ గ్రాండ్‌మాస్టర్ల ప్రదర్శనకు తోడు యువ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) ఆర్‌.ప్రజ్ఞానంద, మహిళా అంతర్జాతీయ మాస్టర్‌ (డబ్ల్యూఐఎం) దివ్య దేశ్‌ముఖ్‌ అద్భుత విజయాల కారణంగా ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్టు పటిష్టమైన చైనాకు 4–2తో షాక్‌ ఇచ్చింది. లీగ్‌ దశలో అజేయంగా నిలిచి పూల్‌ ‘ఎ’లో 17 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మూడు లీగ్‌ మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు నెగ్గడం విశేషం. తొలుత భారత్‌ ఏడో రౌండ్‌లో 4–2తో జార్జియాపై... ఎనిమిదో రౌండ్‌లో 4.5–1.5తో జర్మనీపై... తొమ్మిదో రౌండ్‌లో 4–2తో చైనాపై విజయం సాధించింది. (చదవండి: అజహర్‌ అలీ సెంచరీ: పాక్‌ 273 )

భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరడంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక కీలకపాత్ర పోషించారు. చైనాతో జరిగిన మ్యాచ్‌లో 14 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్‌ 71 ఎత్తుల్లో జినెర్‌ జుపై; 15 ఏళ్ల ప్రజ్ఞానంద 66 ఎత్తుల్లో యాన్‌ లియుపై గెలుపొందారు. 32వ ర్యాంకర్‌ యాంగి యుతో జరిగిన గేమ్‌ను హరికృష్ణ 63 ఎత్తుల్లో... మహిళల ప్రపంచ నంబర్‌వన్‌ యు ఇఫాన్‌తో జరిగిన గేమ్‌ను హంపి 42 ఎత్తుల్లో... ప్రస్తుత మహిళల ప్రపంచ చాంపియన్, నాలుగో ర్యాంకర్‌ జూ వెన్‌జున్‌తో జరిగిన గేమ్‌ను హారిక 41 ఎత్తుల్లో... ప్రపంచ మూడో ర్యాంకర్‌ డింగ్‌ లిరెన్‌తో జరిగిన గేమ్‌ను విదిత్‌ 32 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. ఈనెల 28న క్వార్టర్‌ ఫైనల్స్‌ జరుగుతాయి. (ఐసీసీ ‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో కలిస్, లీసా, జహీర్‌ అబ్బాస్‌)

మరిన్ని వార్తలు