IND Vs SL 2nd ODI: ప్రపంచ రికార్డు నెలకొల్పిన టీమిండియా

21 Jul, 2021 15:51 IST|Sakshi

కొలొంబొ: అసాధార‌ణ పోరాటపటిమతో  శ్రీలంక‌పై రెండో వ‌న్డే గెలిచిన టీమిండియా.. పలు రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకుంది. ఈ విజ‌యంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న  టీమిండియా.. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఏ జట్టుకు సాధ్యపడని ఓ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఓ ప్రత్యర్ధి(శ్రీలంక)పై అత్యధిక విజయాలు సాధించిన ఏకైక జట్టుగా రికార్డు నెలకొల్పింది. నిన్నటి మ్యాచ్‌లో విజయం ద్వారా టీమిండియా.. లంకపై 93వ విజయాన్ని నమోదు చేసింది. గతంలో వన్డేల్లో ఏ జట్టు కూడా ఓ ప్రత్యర్ధి ఇన్ని విజయాలు నమోదు చేయలేదు.

నిన్నటి మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు భారత్‌(శ్రీలంకపై 92 విజయాలు), ఆస్ట్రేలియా(న్యూజిలాండ్‌పై 92 విజయాలు), పాకిస్తాన్‌(శ్రీలంకపై 92 విజయాలు) జట్ల పేరిట సంయుక్తంగా ఉండింది. అయితే మంగళవారం జరిగిన మ్యాచ్‌తో టీమిండియా చరిత్ర తిరగరాసింది. అలాగే నిన్నటి ఉత్కంఠ పోరులో విజయం ద్వారా టీమిండియా మరిన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం శ్రీలంకపై భారత్‌కు వ‌రుస‌గా ప‌దో విజ‌యం కాగా,  వ‌రుస‌గా తొమ్మిదో సిరీస్ విజ‌యంగా కూడా నిలిచింది.

ఇక వ్య‌క్తిగ‌త రికార్డుల విష‌యానికి వ‌స్తే.. టీమిండియా తాజా సంచలనం దీప‌క్ చాహ‌ర్.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి రెండో అత్యధిక పరుగులు(69 నాటౌట్‌) సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. అత‌ని కంటే ముందు 2019 ప్రపంచక‌ప్ సెమీఫైన‌ల్లో ర‌వీంద్ర జడేజా ఇదే స్థానంలో వ‌చ్చి 77 ప‌రుగులు చేశాడు. ఇక భువ‌నేశ్వ‌ర్‌తో క‌లిసి దీప‌క్ చాహ‌ర్ నెల‌కొల్పిన 84 ప‌రుగుల భాగస్వామ్యం.. 8వ వికెట్‌కు ఇండియా త‌ర‌ఫున రెండో అత్య‌ధిక పార్ట్‌న‌ర్‌షిప్‌గా రికార్డుల్లోకెక్కింది. 2017లో ధోనీతో క‌లిసి భువీ.. శ్రీలంక‌పైనే 8వ వికెట్‌కు 100 ప‌రుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

మరిన్ని వార్తలు