టీమిండియా ప్రాక్టీస్‌ అదుర్స్‌.. ఈ పర్యటనలో ఇదే తొలిసారి 

10 Jun, 2021 14:36 IST|Sakshi

లండన్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత టెస్ట్ జట్టు ఈ నెల 18 నుండి ప్రారంభంకానున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)​ఫైనల్​నేపథ్యంలో ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఇంగ్లండ్‌ గడ్డపై కాలు మోపాక మూడు రోజులు కఠిన క్వారంటైన్‌లో గడిపిన భారత జట్టు.. తొలిసారి ఓ బృందంగా సాధన​చేసింది. దాదాపు నాలుగు వారాల తర్వాత టీమిండియాకు ఇదే తొలి ట్రైనింగ్‌ సెషన్‌ కావడంతో.. ఆటగాళ్లంతా హుషారుగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'ఈ పర్యటనలో ఇదే మా తొలి గ్రూప్‌ ప్రాక్టీస్‌, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు' అంటూ క్యాప్షన్‌ జోడించింది. 

కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు టీమిండియాకు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకపోవడంతో ఆటగాళ్లంతా నెట్ సెషన్‌లోనే తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే, ఓపెనర్ రోహిత్ శర్మ, టెస్ట్ స్పెసలిస్ట్ చెతేశ్వర్ పుజారాలు సాధనలో మునిగిపోయారు. అందరూ నెట్ సెషన్‌లో చమటోడ్చారు. కోహ్లీ బ్యాట్ లేకుండా కెమెరాకు పోజులివ్వగా.. రోహిత్ భారీ షాట్లు ఆడుతూ కనిపించాడు. గిల్, పంత్ బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌, వికెట్‌ కీపింగ్‌ సాధన చేశారు. ఇక బౌలర్లు సిరాజ్, అశ్విన్, బుమ్రా, ఇషాంత్, షమీలు హుషారుగా బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. డ్యూక్‌ బంతులతో సాధన చేస్తూ ఊహించని స్వింగ్‌ను రాబడుతూ.. సంతోషంలో మునిగితేలారు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2021 వాయిదా పడిన అనంతరం ఇళ్లకు వెళ్లిపోయిన టీమిండియా ఆటగాళ్లు.. ఇంగ్లండ్‌ పర్యటన నిమిత్తం ముంబైలో రెండు వారాలు క్వారంటైన్‌లో గడిపారు. అనంతరం జూన్‌ 3న భారత బృందం ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్‌కు చేరుకుంది. అక్కడ ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు మూడు రోజుల పాటు హోటల్‌ గదుల్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆతర్వాత మూడు రోజుల పాటు ఒక్కో ఆటగాడు మాత్రమే సాధన చేశారు. గురువారం నుంచే భారత బృందం కలిసికట్టుగా సాధన మొదలుపెట్టింది. కాగా, ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే డబ్యూటీసీ ఫైనల్‌లో భారత్‌.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. సుదీర్ఘ విరామానంతరం తిరిగి ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. 
చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శిఖర్‌ ధవన్‌ పేరు ఖరారు..?

మరిన్ని వార్తలు