కింగ్‌ కోహ్లి సెంచరీ కొడితే టీమిండియా గెలవాల్సిందే.. అదీ లెక్క..!

12 Jan, 2023 11:40 IST|Sakshi

IND VS SL 1st ODI: 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జనవరి 10న శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో శతకం బాదిన విరాట్‌ కోహ్లి (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్‌).. ఈ సెంచరీతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 45వ శతకాన్ని, ఓవరాల్‌గా 73వ అంతర్జాతీయ సెంచరీని బాదిన కోహ్లి.. శ్రీలంకపై తన 9వ శతకాన్ని నమోదు చేసి క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ రికార్డును (శ్రీలంకపై 8 శతకాలు) బద్దలుకొట్టాడు. ఈ క్రమంలో శ్రీలంక, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియాలపై 9 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డులతో పాటు కోహ్లి మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

వన్డేల్లో కింగ్‌ సెంచరీ చేసిన 37 సందర్భాల్లో (ఓవరాల్‌గా 45 సెంచరీలు) టీమిండియా విజయం సాధించింది. ఈ ఫార్మాట్‌ చర్రితలో ఇది ప్రపంచ రికార్డుగా నమోదైంది. గతంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ సెంచరీ చేసిన 35 సందర్భాల్లో (ఓవరాల్‌గా 49 సెంచరీలు) టీమిండియా విజయం సాధించింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే, కోహ్లి సెంచరీ కొడితే టీమిండియా గెలుపు డిసైడ్‌ అయిపోతుందన్నది సుస్పష్టం అవుతుంది. 

ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసిం‍ది. కోహ్లి సెంచరీతో, రోహిత్‌ శర్మ (83), శుభ్‌మన్‌ గిల్‌ (70) అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో నిస్సంక (72) అర్ధసెంచరీతో, షనక (108 నాటౌట్‌) సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంక గెలవలేకపోయింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే కోల్‌కతాలో ఇవాళ (జనవరి 12) జరుగనుం‍ది. 

మరిన్ని వార్తలు