Karuna Jain Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ గుడ్‌బై

24 Jul, 2022 19:14 IST|Sakshi

టీమిండియా సీనియర్‌ మహిళా వికెట్‌ కీపర్‌ కరుణ జైన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించింది. 36 ఏళ్ల కరుణ జైన్‌ 2005 నుంచి 2014 మధ్య కాలంలో టీమిండియా తరపున ఐదు టెస్టులు, 44 వన్డేలు, తొమ్మిది టి20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించింది. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కరుణ జైన్‌ తన డెబ్యూ మ్యాచ్‌లోనే అర్థశతకంతో ఆకట్టుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 64 పరుగులు చేసింది.  2005లో ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన భారత మహిళా జట్టులో కరుణ జైన్‌ సభ్యురాలు.

''క్రికెట్ కెరీర్ ఒక అద్భుతమైన ప్రయాణం ఈరోజుతో ముగిసింది. నా ప్రయాణంలో కుటుంబసభ్యులు అండగా నిలిచారు. నేను మైదానంలోకి అడుగుపెట్టినప్పుడల్లా అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలంటూ తోటి క్రికెటర్లు ఎంకరేజ్‌ చేయడం ఎప్పటికి మరిచిపోను. మీ అందరి సపోర్ట్‌తోనే ఇంత కాలం క్రికెట్‌ ఆడగలిగాను. నా క్రికెట్ ప్రయాణంలో భాగమైన కోచ్‌లు, సహాయక సిబ్బంది, సహచరులందరికీ ధన్యవాదాలు.'' అంటూ ఎమోషనల్‌ నోట్‌ రాసుకొచ్చింది. 

కరుణ జైన్‌.. టీమిండియా మహిళా జట్టుతో పాటు దేశవాలిలో ఎయిరిండియా, కర్ణాటక, పాండిచ్చేరి జట్లకు ప్రాతినిధ్యం వహించింది. భారత జట్టు తరఫున 1100కు పైగా పరుగులు చేసిన కరుణ జైన్‌ ఖాతాలో వన్డేల్లో ఒక సెంచరీ, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కరుణ జైన్ స్వస్థలం బెంగళూరు.

చదవండి: R Sai Kishore: సంచలన బౌలింగ్‌తో మెరిసిన గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్‌

>
మరిన్ని వార్తలు