ENG Vs IND: ఇన్నింగ్స్‌ ఓటముల్లో టీమిండియా చెత్త రికార్డు

29 Aug, 2021 11:20 IST|Sakshi

లీడ్స్‌: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘోర పరాభవం మూటగట్టుకుంది. గత రెండు టెస్టులకు ఏమాత్రం సరిపోని ప్రదర్శనతో టీమిండియా బోల్తా పడింది. ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్‌ ఐదు టెస్టుల సిరీస్‌ను 1–1తో సమం చేసింది.సెప్టెంబర్‌ 2 నుంచి ఓవల్‌లో నాలుగో టెస్టు జరుగుతుంది. కాగా ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు బద్దలయ్యాయి. ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమి పాలయిన టీమిండియా పలు చెత్త రికార్డులు నమోదు చేసింది. అవేంటనేవి ఒకసారి పరిశీలిస్తే..  

చదవండి: అంపైర్‌ను భయపెట్టిన పుజారా.. తృటిలో తప్పించుకున్నాడు

► టీమిండియా టెస్టుల్లో ఇన్నింగ్స్‌ ఓటమి పొందడం ఇది 45వ సారి. ఇక ఇంగ్లండ్‌ 63 ఇన్నింగ్స్‌ ఓటములతో తొలి స్థానంలో ఉండగా.. వెస్డిండీస్‌ (46), ఆస్ట్రేలియా(44), బంగ్లాదేశ్‌(43), న్యూజిలాండ్‌(39) ఉన్నాయి. 

► విరాట్‌ కోహ్లి సారధ్యంలో టీమిండియా టాస్‌ గెలిచిన టెస్టులో ఇన్నింగ్స్‌ ఓటమి పొందడం ఇది రెండోసారి. ఇంతకముందు ఆస్ట్రేలియాతో  అడిలైడ్‌ వేదికగా జరిగిన టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతోనే పరాజయం పాలైంది. అంతేగాక కోహ్లికి కెప్టెన్‌గా  ఇంగ్లండ్‌పై ఇది రెండో ఇన్నింగ్స్‌ ఓటమి. అంతకముందు 2018 లార్డ్స్‌ టెస్టులోనూ ఇన్నింగ్స్‌ 159 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది.

► ఇక​టీమిండియా ఒక టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో అత్యల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో భారత్‌ మరో చెత్త రికార్డును నమోదు చేసింది. లీడ్స్‌ టెస్టులో 63 పరుగుల వ్యవధిలో భారత్‌ మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. ఇక 2016-17లో ఆసీస్‌పై 41 పరుగుల వ్యవధిలో.. 1952లో మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌పై 64 పరుగుల వ్యవధిలో.. 2020-21లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై 77 పరుగుల వ్యవధిలో వికెట్లు కోల్పోయి పరాజయాలు చవిచూసింది.

► ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా జోరూట్‌కు టెస్టుల్లో ఇది 27వ విజయం.ఈ విజయంతో రూట్‌( 27 విజయాలు, 55 టెస్టులు) అత్యధిక విజయాలు సాధించిన ఇంగ్లండ్‌ కెప్టెన్లలో తొలిస్థానంలో నిలిచాడు. మైకెల్‌ వాన్‌(51 టెస్టుల్లో 26 విజయాలు) రెండో ‍స్థానం, ఆండ్రూ స్ట్రాస్‌ (50 టెస్టుల్లో 24 విజయాలు), అలిస్టర్‌ కుక్‌( 59 టెస్టుల్లో 24 విజయాలు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.  

మరిన్ని వార్తలు