Varun Chakravarthy: వికెట్‌ కీపర్‌గా మొదలెట్టాడు.. మిస్టరీ స్పిన్నర్‌లా రాణిస్తున్నాడు

18 Jul, 2021 17:46 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున దుమ్మురేపిన 29 ఏళ్ల వరుణ్‌ చక్రవర్తి.. మిస్టరీ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా, అతని బౌలింగ్‌లో ఉన్న మిస్టరీ.. అతని జీవన ప్రయాణంలోనూ కొనసాగుతుంది. వికెట్ కీపర్‌గా క్రికెట్ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన వరుణ్‌.. ప్రస్తుతం వైవిధ్యమైన బౌలర్‌గా రాణిస్తున్నాడు. 13 ఏళ్ల వయసులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కెరీర్ ప్రారంభించిన అతను 17 ఏళ్ల వరకు అలానే కొనసాగాడు. అయితే వికెట్‌ కీపర్‌గా పెద్దగా రాణించకపోవడంతో క్రికెట్‌ను పక్కనపెట్టేసి చదువుపై దృష్టిసారించాడు. ఎస్ఆర్‌ఎమ్ యూనివర్సిటీలో అర్కిటెక్చర్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఫ్రిలాన్స్ ఆర్కిటెక్ట్‌గా పనిచేశాడు. కానీ ఆ పని కిక్ ఇవ్వకపోవడంతో మళ్లీ 23 ఏళ్ల వయసులో టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.

అయితే ఈసారి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కాకుండా మీడియం పేసర్ అవతారమెత్తాడు. టెన్నిస్ బాల్ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. కానీ మొకాలి గాయం కావడంతో పేస్ బౌలింగ్‌ను వదిలేసి స్పిన్నర్‌గా అవతారమెత్తాడు. టెన్నిస్ బాల్ క్రికెట్‌లో స్పిన్నర్స్‌ను బాగా కొడతారని భావించిన ఈ తమిళనాడు కుర్రాడు.. తన స్పిన్‌కు పేస్‌ను జోడించి విభిన్నమైన వేరియేషన్స్‌లో బౌలింగ్ చేశాడు. లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, గూగ్లీ, ఫ్లిప్పర్, టాప్ స్పిన్, క్యారమ్ బాల్స్, ఆర్మ్ బాల్స్ ఇలా మొత్తం ఏడు రకాల వేరియేషన్స్‌ తో బౌలింగ్ చేసేవాడు. ఒకే ఓవర్‌లో లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, గూగ్లీ వంటి విభిన్నమై వేరియేషన్స్‌తో బంతులు వేయడం, దానికి పేస్ జోడించడంతో బ్యాట్స్‌మెన్ తెగ ఇబ్బంది పడేవారు.

అనంతరం 2017లో సీఎస్‌కే నెట్ బౌలర్‌గా అవకాశం దక్కించుకున్న వరుణ్‌.. మాజీ కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్ కార్తీక్‌ దృష్టిని ఆకర్శించాడు. డీకే పట్టుపట్టి మరీ వరుణ్‌ను కేకేఆర్‌ నెట్‌ బౌలర్‌గా ఎంపిక చేయించాడు. అక్కడ సునీల్ నరైన్‌ సాయంతో మెళకువలు నేర్చుకున్న వరుణ్‌.. మిస్టరీ స్పిన్నర్‌లా మారాడు. దీంతో 2019 ఐపీఎల్ వేలంలో కింగ్స్ పంజాబ్ జట్టు వరుణ్‌ను రూ.8.4 కోట్లకు  కొనుగోలు చేసింది. అనంతరం 2020 సీజన్‌లో కేకేఆర్ మేనేజ్‌మెంట్‌ వరుణ్‌ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన అతను 17 వికెట్లు తీశాడు. తాజా సీజన్‌లోనూ  అద్భుతంగా రాణించిన వరుణ్‌.. 7 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు.  

కాగా, ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్న వరుణ్‌.. గతేడాదే టీమిండియా పిలుపు అందుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన టీ20 జట్టులో అతనికి చోటు దక్కింది. కానీ భుజ గాయం కారణంగా ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ అవకాశం దక్కింది. అది కూడా యోయో ఫిట్‌నెస్ టెస్ట్ అధిగమించకపోవడంతో చేజారింది. 

మరిన్ని వార్తలు