టీమిండియాకు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కావాలి.. నాకు ఛాన్స్‌ ఇవ్వండి

9 Jul, 2021 16:19 IST|Sakshi

లండన్: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన మనసులో మాటని బయటపెట్టాడు. రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లలో కనీసం ఒక్కసారైనా భారత్ తరఫున ఆడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. తనకి మరో ఛాన్స్ ఇవ్వాలని భారత సెలెక్టర్లని అభ్యర్థించాడు. టీమిండియాకు టీ20ల్లో సరైన మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ లేడని, జట్టు నిండా టాపార్డర్‌ బ్యాట్స్‌మెనే ఉన్నారని పేర్కొన్నాడు. హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా మినహా మిడిల్‌ ఆర్డర్‌లో సరైన బ్యాట్స్‌మన్‌ లేడని, అందుకే తనకు ఛాన్స్‌ ఇవ్వాలని సెలక్టర్లను కోరాడు.  

తనకింకా ఆటపై మక్కువ తగ్గలేదని, 2019 వన్డే ప్రపంచకప్‌లో విఫలమవ్వడం వల్లే తనని టీ20 జట్టు నుంచి తప్పించారని తెలిపాడు. కాగా, ఇటీవలే ముగిసిన ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ ద్వారా వ్యాఖ్యాతగా కొత్త అవతారమెత్తిన డీకే.. భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కి కూడా కామెంట్రీ చెప్పనున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను ఫిట్‌గా ఉన్నంతకాలం క్రికెట్‌ ఆడాలనుకుంటున్నానని, రాబోయే రెండు టీ20 ప్రపంచకప్‌లలో భారత్‌ తరఫున ఒక్కసారైనా ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నానని,  ఒక్క ఛాన్స్ ఇస్తే తానేంటో నిరూపించుకుంటానని తెలిపాడు. 

కాగా, 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన డీకే.. అప్పటి నుంచి టీమిండియాకి దూరంగా ఉన్నాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా మారడంతో.. ఇక కార్తీక్‌ పనైపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో డీకే తన మనసులో మాట బయటపెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కాగా, డీకే ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడుతున్నాడు. క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించకుండానే వ్యాఖ్యాతగా మారి జెంటిల్మెన్‌ గేమ్‌లో కొత్త ఒరవడి సృష్టించాలని డీకే భావిస్తున్నాడు.
 

మరిన్ని వార్తలు