ప్రసిద్ద్‌ కృష్ణ.. మేడిన్‌ ఆస్ట్రేలియా

25 Mar, 2021 16:41 IST|Sakshi

పూణే:  ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో సంచలన ప్రదర్శన(4/54)తో ఆకట్టుకున్న టీమిండియా నయా పేస్‌ టాలెంట్‌ ప్రసిద్ద్‌ కృష్ణ.. ఆసీస్ లెజెండరీ పేసర్ జెఫ్ థామ్సన్ శిష్యరికంలో రాటు దేలాడు. థామ్సన్ ఇచ్చిన చిట్కాలతో తన పేస్‌కు పదును పెట్టాడు. స్వతహాగా ఆసీస్‌ మాజీ స్పీడ్‌స్టర్‌ బ్రెట్‌ లీ అభిమాని అయిన ఆయన.. ఆస్ట్రేలియా పిచ్‌లపై కఠోర సాధన చేశాడు. అలాగే ఎంఆర్‌ఎఫ్ అకాడమీలో ఆసీస్ ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ పేసర్‌ గ్లెన్ మెక్‌గ్రాత్ వద్ద కూడా శిక్షణ తీసుకున్నాడు. ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్ల సూచనలు, సలహాలతో పాటు కఠోర సాధనకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ఈ కర్ణాటక కుర్రాడు.. టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంగా ఉద్భవించాడు. 

కాగా, పూణేలోని ఎమ్‌సీఏ మైదానం వేదికగా జరిగిన తొలి వన్డేలో కృనాల్‌ పాండ్యాతో పాటు వన్డే క్యాప్‌ను అందుకున్న ప్రసిద్ద్‌‌.. మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రదర్శనతో అదరగొట్టాడు. కీలక సమయంలో జేసన్ రాయ్ (46), ప్రమాదకర బెన్ స్టోక్స్‌ (1)ను ఔట్‌ చేసి ఇంగ్లండ్ పతనాన్ని ప్రారంభించి, ఆతరువాత మిడిల్‌ ఓవర్లలో సామ్‌ బిల్లింగ్స్‌ (18), టామ్ కర్రన్ (11) వికెట్లు తీసి ఇంగ్లండ్‌  ఓటమిని ఖరారు చేశాడు. మొత్తం 8.1 ఓవర్లు బౌల్‌ చేసిన ఆయన.. 54 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతను వన్డే అరంగేట్రంలో ఏ భారత బౌలర్‌కు సాధ్యపడని నాలుగు వికెట్ల ఘనతను సాధించాడు. 
చదవండి: ఎనిమిదేళ్ల తర్వాత దాయాదుల క్రికెట్‌ పోరు..?

>
మరిన్ని వార్తలు