ఇంగ్లండ్‌ పర్యటన షెడ్యూల్‌పై భారత మాజీ కెప్టెన్‌ మండిపాటు

31 May, 2021 16:06 IST|Sakshi

ముంబై: ఇంగ్లండ్‌ పర్యటనకు బీసీసీఐ రూపొందించిన షెడ్యూల్‌పై భారత మాజీ కెప్టెన్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ మండిపడ్డాడు.‌ ఈ పర్యటనలో భారత్‌.. జూన్‌ 18 నుంచి 22 మధ్యలో న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ ఆడనుంది. అయితే, ఈ మ్యాచ్‌ ముగిశాక టీమిండియా 42 రోజులు ఖాళీగా ఉండటంపై భారత అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ పర్యటనకు కుటుంబ సమేతంగా వెళ్తున్న భారత జట్టు ఇన్ని రోజుల పాటు ఖాళీగా కాలం గడపాల్సి వచ్చేలా షెడ్యూల్ రూపొందించడం ఏంటని వెంగ్‌సర్కా్ర్‌ నిలదీశాడు. 

ఇంత దారుణమైన షెడ్యూల్ ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఒక జట్టును దేశం కాని దేశంలో 42 రోజుల పాటు ఖాళీగా కూర్చోబెట్టడం ఏ మాత్రం సరికాదని, అన్ని రోజులు క్రికెటర్లు ఏం చేస్తారని ప్రశ్నించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన వెంటనే టెస్ట్ సిరీస్ ఆరంభం అయ్యేలా షెడ్యూల్ ఎందుకు రూపొందించలేకపోయారని ప్రశ్నించాడు. కాగా, దాదాపు నెలన్నర ఖాళీగా ఉన్న తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ ఆడనుంది. షెడ్యూల్ ప్రకారం.. జూన్ 3వ తేదీన ఇంగ్లండ్‌లో అడుగు పెట్టబోయే భారత జట్టు, అక్కడి నుంచి ఐపీఎల్‌లో పాల్గొనేందుకు సెప్టెంబర్‌లో యూఏఈకి బయల్దేరనుంది. అంటే ఆరు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌.. దాదాపు నాలుగున్నర నెలలు కాలం అక్కడే గడపనుంది.
చదవండి: మంజ్రేకర్‌ కోసం వెతికాను.. అతని కోసమే అలా చేశాను

మరిన్ని వార్తలు