టెక్నాలజీ... నాన్‌ స్ట్రయికర్‌నూ చూడాలి: అశ్విన్‌

29 Jul, 2020 03:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫ్రంట్‌ఫుట్‌ నోబాల్‌ తెలుసుకునేందుకు థర్డ్‌ అంపైర్‌కు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో భారత స్పిన్నర్‌ అశ్విన్‌... టెక్నాలజీని నాన్‌ స్ట్రయికర్‌ వైపు కూడా వినియోగించాలని సూచించాడు. ‘బంతి బౌల్‌ కాకముందే క్రీజ్‌ దాటే నాన్‌ స్ట్రయికర్‌ బ్యాట్స్‌మన్‌పై కన్నేసేందుకు టెక్నాలజీ వాడాలి. రీప్లేలో బంతి పడకముందే అతను పరుగందుకుంటే ఆ రన్స్‌ లెక్కలోకి తీసుకోరాదు. అప్పుడే క్రికెట్‌లో బ్యాట్స్‌మన్, బౌలర్‌కు సమానత్వం లభిస్తుంది. దీనిపై నేను ఇంకాస్త స్పష్టత కూడా ఇస్తాను. నాన్‌ స్ట్రయికర్‌ గనుక అలా బంతిని బౌలర్‌ సంధించకముందే పరుగు పెడితే 2 రన్స్‌ సులభమవుతాయి. దీంతో అడిన బ్యాట్స్‌మన్‌కే మరుసటి బంతి ఆడే అవకాశం లభిస్తుంది. అప్పుడు అవసరాన్ని బట్టి అతను బౌండరీ లేదంటే సిక్సర్‌ బాదేయొచ్చు. దీనివల్ల నాకు 7 పరుగుల మూల్యం తప్పదు. అందుకే నేను నాన్‌ స్ట్రయికర్‌వైపు కూడా టెక్నాలజీని చూడమంటున్నాను’ అని ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు