CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు

4 Aug, 2022 09:23 IST|Sakshi

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మరో పతకం సాధించింది. హైజంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్‌ గేమ్స్‌ హైజంప్‌ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్‌ శంకర్‌ రికార్డు సృష్టించాడు. భారత కాలమాన ప్రకారం బుధవారం అర్థరాత్రి జరిగిన హైజంప్‌ ఫైనల్స్‌లో శంకర్‌ 2.22 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు.

న్యూజిలాండ్‌కు చెందిన హమీష్‌ కెర్‌ 2.25 మీటర్ల జంప్‌చేసి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్‌ స్టార్క్‌ సిల్వర్‌ సాధించాడు. అయితే జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో శంకర్‌ 2.27 మీటర్ల దూరం జంప్‌ చేయడం గమనార్హం. శంకర్‌ గత రికార్డుతో పోల్చితే కామన్వెల్త్‌లో కొంత నిరాశ పరిచినప్పటికీ హైజంప్‌లో దేశానికి తొలిపతకం తీసుకొచ్చిన ప్లేయర్‌గా మాత్రం చరిత్రలో నిలిపోయాడు. తాజా పతకంతో భారత్‌ ఖాతాలో ఇప్పటివరకు 18 పతకాలు ఉండగా.. అందులో 5 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి. 

ఇక కాంస్య పతకం సాధించిన శంకర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ''తేజస్విని శంకర్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో హైజంప్‌ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. కాంస్య పతకం సాధించినందుకు అభినందనలు. నీ ప్రదర్శన పట్ల దేశం గర్విస్తుంది. భవిష్యత్తులో మరిన్ని  విజయాలు సాధించాలని కోరుకుంటున్నా.'' అంటూ తెలిపారు. ఇక కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా శంకర్‌ను అభినందించారు. కామన్వెల్త్‌ క్రీడల్లో హైజంప్‌ విభాగంలో పతకం సాధించిన మొదటి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడని ప్రశంసించారు.

చదవండి: Commonwealth Games 2022: తులిక తెచ్చిన రజతం

CWG 2022: బార్బడోస్‌పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా మహిళలు

మరిన్ని వార్తలు