సాయిప్రణీత్‌కు స్వర్ణం

7 Oct, 2022 06:23 IST|Sakshi

డబుల్స్‌ విజేతలు సిక్కిరెడ్డి–గాయత్రి

జాతీయ క్రీడల బ్యాడ్మింటన్‌  

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో గురువారం మూడు స్వర్ణాలు చేరాయి. బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు సాధించిన జట్టుకు బాస్కెట్‌బాల్‌లో కూడా మరో బంగారు పతకం దక్కింది. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో తెలంగాణ షట్లర్‌ సాయిప్రణీత్‌ 21–11, 12–21, 21–16తో మిథున్‌ మంజునాథ్‌ (కర్నాటక)ను ఓడించి విజేతగా నిలిచాడు. మహిళల డబుల్స్‌లో ఫైనల్లో ఎన్‌.సిక్కిరెడ్డి–పుల్లెల గాయత్రి గోపీచంద్‌ ద్వయం పసిడి పతకాన్ని తమ ఖాతాలో వేసుకుంది.

ఫైనల్లో సిక్కి–గాయత్రి 21–14, 21–11తో శిఖా గౌతమ్‌–అశ్విని భట్‌ (కర్నాటక)ను చిత్తు చేశారు. మహిళల బాస్కెట్‌బాల్‌ 5–5 ఈవెంట్‌లో కూడా తెలంగాణకు స్వర్ణం లభించింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో తెలంగాణ 67–62 పాయింట్ల తేడాతో తమిళనాడుపై విజయం సాధించింది. మూడు క్వార్టర్‌లు ముగిసే సరికి 5 పాయింట్లతో వెనుకబడి ఉన్న తెలంగాణ నాలుగో క్వార్టర్‌లో 10 పాయింట్ల ఆధిక్యం సాధించి విజయాన్నందుకోవడం విశేషం. తెలంగాణ స్విమ్మర్‌ వ్రిత్తి అగర్వాల్‌ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో రెండో స్థానంలో నిలిచిన విృత్తి రజత పతకాన్ని అందుకుంది.

మరిన్ని వార్తలు