‘గ్రాండ్‌మాస్టర్‌’ రాహుల్‌

12 Jun, 2022 06:21 IST|Sakshi

భారత 74వ జీఎంగా తెలంగాణ ప్లేయర్‌

సాక్షి, హైదరాబాద్‌: మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ తెలంగాణ యువ చెస్‌ ప్లేయర్‌ రాహుల్‌ శ్రీవత్సవ్‌ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదాను దక్కించుకున్నాడు. భారత్‌ తరఫున 74వ గ్రాండ్‌మాస్టర్‌గా రాహుల్‌ నిలిచాడు. హర్ష భరతకోటి, ఇరిగేశి అర్జున్, రాజా రిత్విక్‌ తర్వాత తెలంగాణ నుంచి గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందిన నాలుగో ప్లేయర్‌గా రాహుల్‌ నిలిచాడు. జీఎం టైటిల్‌ ఖరారు కావాలంటే ఓ చెస్‌ ప్లేయర్‌ మూడు జీఎం నార్మ్‌లను అందుకోవడంతోపాటు 2500 ఎలో రేటింగ్‌ పాయింట్లను సాధించాలి. 19 ఏళ్ల రాహుల్‌ 2019లోనే మూడు జీఎం నార్మ్‌లను సాధించినా 2500 ఎలో రేటింగ్‌ పాయింట్లకు దూరంగా నిలిచాడు. దాంతో అతనికి జీఎం టైటిల్‌ ఖరారు కాలేదు.

అదే సమయంలో అమెరికాలోని యూనివర్సీటీ ఆఫ్‌ టెక్సాస్‌లో రాహుల్‌ ఎకనామిక్స్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో చేరాడు. ఒకవైపు చదువు కొనసాగిస్తూ యూనివర్సిటీ చెస్‌ జట్టులో తన ప్రావీణ్యానికి మరింత పదును పెట్టాడు. నెల రోజుల క్రితం 2468 ఎలో రేటింగ్‌ పాయింట్లతో ఇటలీ చేరుకున్న రాహుల్‌ అక్కడ మూడు టోర్నీలలో బరిలోకి దిగాడు. తాజాగా కాటోలికా చెస్‌ ఫెస్టివల్‌లో రాహుల్‌ ఎనిమిదో రౌండ్‌లో జార్జియా గ్రాండ్‌మాస్టర్‌ లెవాన్‌ పంత్‌సులైతో జరిగిన గేమ్‌ను ‘డ్రా’ చేసుకోవడంతో అతను 2500 ఎలో రేటింగ్‌ పాయింట్ల మైలురాయిని అందుకొని జీఎం టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు