NED Vs ZIM: శతకంతో అదరగొట్టిన తెలుగు క్రికెటర్‌; జింబాబ్వేపై నెదర్లాండ్స్‌ విజయం

21 Mar, 2023 21:50 IST|Sakshi

నెదర్లాండ్స్‌కు జట్టుకు ఆడుతున్న తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు అదరగొట్టాడు. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అజేయ సెంచరీతో మెరవడమే గాక జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. విషయంలోకి వెళితే.. మంగళవారం జరిగిన తొలి వన్డేలో నెదర్లాండ్స్‌ మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 49.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

110 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన తేజ నిడమనూరు (96 బంతుల్లో 110 నాటౌట్‌, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ మార్క్‌ సాధించాడు. అతనికి షారిజ్‌ అహ్మద్‌ 30 పరుగులతో సహకరించాడు. చివర్లో షారిజ్‌ రనౌట్‌ అయినప్పటికి పాల్‌ వాన్‌ మెక్‌రిన్‌ 21 పరుగులు నాటౌట్‌ అండతో తేజ జట్టుకు విజయాన్ని అందించాడు. అంతకముందు కొలిన్‌ అకెర్‌మన్‌ 50 పరుగులతో రాణించాడు.

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 47.3 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌట్‌ అయింది. జింబాబ్వే బ్యాటింగ్‌లో కూడా ఏడో స్థానంలో వచ్చిన క్లైవ్‌ మదానే 74 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మసకద్జ 34, నగరవా 35 పరుగులు చేశారు. డచ్‌ బౌలర్లలో ఫ్రెడ్‌ క్లాసెన్‌ మూడు వికెట్లు తీయగా.. వాన్‌ మెక్రిన్‌ రెండు, గ్లోవర్‌, విక్రమ్‌జిత్‌ సింగ్‌, షారిజ్‌ అహ్మద్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

► కాగా శతకంతో అలరించిన తేజ నిడమనూరు ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ సాధించిన ఐదో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు మైకెల్‌ బ్రాస్‌వెల్‌(127 పరుగులు నాటౌట్‌ వర్సెస్‌ ఐర్లాండ్‌), థామస్‌ ఒడయో(111 పరుగులు నాటౌట్‌ వర్సెస్‌ కెనడా), అబ్దుల్‌ రజాక్‌( 109 పరుగులు నాటౌట్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌( 108 పరుగులు వర్సెస్‌ ఇంగ్లండ్‌).. తాజాగా తేజ నిడమనూరు(110 పరుగులు నాటౌట్‌ వర్సెస్‌ జింబాబ్వే) ఈ జాబితాలో చేరాడు.

► ఇక వన్డేల్లో చేజింగ్‌లో భాగంగా ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఐదో జంటగా తేజ నిడమనూరు, షారిజ్‌ అఫ్రిది నిలిచారు . ఈ జోడి 110 పరుగులు జోడించారు. ఇంతకముందు అఫిఫ్‌ హొసెన్‌-మెహదీ హసన్‌(బంగ్లాదేశ్‌) జోడి 174 పరుగులు, బసిల్‌ హమీద్‌- కాషిఫ్‌ దౌడ్‌(యూఏఈ) జోడి 148 పరుగులు, మహేల జయవర్దనే-ఉపుల్‌ చందన(శ్రీలంక) జోడి 126 పరుగులు, హారిస్‌ సోహైల్‌-షాహిద్‌ అఫ్రిది(పాకిస్తాన్‌) జోడి 110 పరుగులు వరుసగా నాలుగు స్థానాల్లో ఉన్నారు. తాజాగా తేజ నిడమనూరు- షారిజ్‌ అహ్మద్‌(నెదర్లాండ్స్‌) జోడి 110 పరుగులతో వీరి సరసన చేరింది.

చదవండి: క్లాసెన్‌ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్‌ను ఉదేశారు

మరిన్ని వార్తలు