ఖేల్‌రత్న రేసులో తెలుగు తేజాలు

2 Jul, 2021 04:27 IST|Sakshi

చెస్‌లో కోనేరు హంపిని నామినేట్‌ చేసిన ఏఐసీఎఫ్‌

బ్యాడ్మింటన్‌లో సాయిప్రణీత్, శ్రీకాంత్‌లను సిఫారసు చేసిన ‘బాయ్‌’

చెన్నై: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ కోసం ఈసారి భారీగానే దరఖాస్తులు వస్తున్నాయి. దరఖాస్తులు స్వీకరించేందుకు మరో మూడు రోజులు ఉన్నందున ఆయా జాతీయ క్రీడా సంఘాలు, సమాఖ్యలు తమ అత్యుత్తమ క్రీడాకారుల పేర్లను ఈ ప్రతిష్టాత్మక పురస్కారం కోసం నామినేట్‌ చేస్తున్నాయి. తాజాగా అఖిల భారత చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) భారత మహిళా చెస్‌ స్టార్, ప్రపంచ మూడో ర్యాంకర్‌ కోనేరు హంపి పేరును ‘ఖేల్‌రత్న’ కోసం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 34 ఏళ్ల హంపి 2019 డిసెంబర్‌లో ప్రపంచ మహిళల ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌  షిప్‌లో విజేతగా నిలిచింది.

తద్వారా ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా గతేడాది అమెరికాలో జరిగిన కెయిన్స్‌ కప్‌లోనూ టైటిల్‌ సాధించింది. మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో భాగంగా 2019లో రష్యాలో జరిగిన తొలి టోర్నీలో చాంపియన్‌గా, మొనాకో లో జరిగిన రెండో టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా గ్రాండ్‌ప్రి సిరీస్‌లో రెండో స్థానంలో నిలిచి వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించింది. ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టులోనూ హంపి సభ్యురాలిగా ఉంది. హంపికి 2003లోనే అర్జున అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ ఎం.ఆర్‌.లలిత్‌ బాబుతోపాటు ఇతర ప్లేయర్లు విదిత్‌ గుజరాతి, ఆధిబన్, సేతురామన్, భక్తి కులకర్ణి, పద్మిని రౌత్‌ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం ఏఐసీఎఫ్‌ గౌరవ కార్యదర్శి భరత్‌ సింగ్‌ చౌహాన్‌ నామినేట్‌ చేశారు.  
        
బ్యాడ్మింటన్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌... తెలంగాణకు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్‌ పేర్లను ‘ఖేల్‌రత్న’ కోసం భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) సిఫారసు చేసింది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్‌ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌ విభాగంలో సాయిప్రణీత్‌ ఒక్కడే అర్హత సాధించాడు. మరోవైపు 2017లో నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ గెలిచిన శ్రీకాంత్‌ ఆ తర్వాత చెప్పుకోతగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. హెచ్‌ఎస్‌ ప్రణయ్, ప్రణవ్‌ చోప్రా, సమీర్‌ వర్మ పేర్లను ‘అర్జున అవార్డు’ కోసం ‘బాయ్‌’  ప్రతిపాదించింది. ‘ధ్యాన్‌చంద్‌ అవార్డు’ కోసం ఒలింపియన్‌ పీవీవీ లక్ష్మి, లెరాయ్‌ డిసా పేర్లను... ‘ద్రోణాచార్య’ అవార్డు కోసం భాస్కర్‌ బాబు, మురళీధరన్‌ పేర్లను ‘బాయ్‌’ పంపించింది. అవార్డీల కమిటీ మొత్తం దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు తొలి వారంలో తుది అవార్డులు గెల్చుకున్న వారి జాబితాను ప్రకటించే అవకాశముంది.   

మరిన్ని వార్తలు