IPL: మా వాళ్లంతా సూపర్‌.. ఏదో ఒకరోజు నేనూ ఐపీఎల్‌లో ఆడతా: ప్రొటిస్‌ కెప్టెన్‌

3 Jun, 2022 14:02 IST|Sakshi

IND Vs SA T20 Series: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తాను భాగస్వామ్యం కావాలనుకుంటున్నానని దక్షిణాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ తెంబా బవుమా అన్నాడు. ఏదో ఒకరోజు క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తప్పకుండా ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాలం కలిసి వస్తే కెప్టెన్‌గా కూడా వ్యవహరించే అవకాశం రావాలని ఆశిస్తున్నానంటూ మనసులోని మాటను బయటపెట్టాడు.

అయితే, అంతకంటే ముందు ఏదో ఒక జట్టులో ఆడే ఛాన్స్‌ రావాలని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌లో ఇప్పటికే చాలా మంది ప్రొటిస్‌ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఏబీ డివిలియర్స్‌ వంటి స్టార్ల నుంచి బేబీ ఏబీడీ డెవాల్డ్‌ బ్రెవిస్‌ వరకు ఈ జాబితాలో చాలా మందే ఉన్నారు. 

ముఖ్యంగా ఐపీఎల్‌-2022లో కగిసో రబడ, డేవిడ్‌ మిల్లర్‌, ఎయిడెన్‌ మార్కరమ్‌, మార్కో జాన్‌సెన్‌ తదితరులు తాము ప్రాతినిథ్యం వహించిన జట్ల విజయాల్లో తమ వంతు పాత్ర పోషించారు.  ఇక మిల్లర్‌.. గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌ చేరడంలో కీలకంగా వ్యవహరించాడు. టైటిల్‌ గెలిచిన జట్టులో భాగమయ్యాడు.

ఈ క్రమంలో వీరందరిపై ప్రశంసలు కురిపించిన బవుమా.. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన నమోదు చేశారని పేర్కొన్నాడు. రబడ వంద వికెట్లు తీయడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తానూ ఏదో ఒకరోజు ఐపీఎల్‌లో ఆడతానని ఈ 32 ఏళ్ల బ్యాటర్‌ పేర్కొన్నాడు.

ఈ మేరకు.. ‘‘నేను కూడా అక్కడ ఆడతాను. మెరుగ్గా రాణిస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. నిజానికి అక్కడ ఓ జట్టుకు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించాలని ఉంది. ఇది నా ఫాంటసీ. అయితే, ముందు ఐపీఎల్‌లో ఏదో ఒక జట్టుకు ఆడి అనుభవం గడించాలి కదా’’ అని క్రికెట్‌మంత్లీతో బవుమా చెప్పుకొచ్చాడు.

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో 33 మంది ప్రొటిస్‌ ప్లేయర్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. వీరిలో బవుమా లేకపోవడం గమనార్హం. ఇక జూన్‌ 9 నుంచి టీమిండియాతో టీ20 సిరీస్‌ ఆడేందుకు దక్షిణాఫ్రికా సన్నద్ధమవుతోంది. 

చదవండి 👇
అమ్మో అదో పీడకల.. ఆ బౌలర్‌ ఎదురుగా ఉన్నాడంటే అంతే ఇక: జయవర్ధనే
Ind Vs SA T20 Series: టీమిండియాను తక్కువగా అంచనా వేయలేం.. కానీ విజయం మాదే: బవుమా

మరిన్ని వార్తలు