వరల్డ్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌కు కంఠెవరం బాలిక

21 Jul, 2022 19:37 IST|Sakshi

సబ్‌జూనియర్స్‌ కేటగిరీలో పాల్గొననున్న జ్ఞానదివ్య 

ఇప్పటికే జాతీయస్థాయిలో బంగారు పతకాలు కైవసం   

సాక్షి, తెనాలి: అనతికాలంలోనే అద్భుత విజయాలు సొంతం చేసుకుని అందరి ప్రశంసలూ అందుకుంటుంది కంఠెవరం బాలిక నాగం జ్ఞాన దివ్య. త్వరలో అంతర్జాతీయస్థాయిలోనూ మెరవనుంది. ఫిట్‌నెస్‌ కోసమని సాధన ప్రారంభించిన ఏడాదిలోనే టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరగనున్న వరల్డ్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. పవర్‌ లిఫ్టింగ్‌ సబ్‌ జూనియర్‌ విభాగంలో సత్తా చాటనుంది.  

కుటుంబ నేపథ్యం ఇదీ..  
గుంటూరు జిల్లా తెనాలి మండలం కఠెవరంలోని కేబుల్‌ ఆఫీసులో పనిచేసే నాగం వెంకటేశ్వరరావు, సుధారాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె పూజిత బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతోంది. రెండో కుమార్తె జ్ఞానదివ్య గత మార్చిలో ఇంటర్‌ పూర్తిచేసింది. దివ్య ఫిట్‌నెస్‌ కోసమని గ్రామంలోని మాతృశ్రీ వెయిట్‌లిఫ్టింగ్‌ అకాడమీలో ఏడాది కిందట చేరింది.  నిత్యం సాధన చేసింది. ఆమె ఆసక్తిని గమనించిన ఫవర్‌ లిఫ్టర్‌ కొల్లిపర నాగశిరీష దివ్యను ప్రోత్సహించారు. 


పవర్‌లిఫ్టింగ్‌లో మెళకువలు నేర్పారు. నందివెలుగు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న నాగశిరీష పవర్‌లిఫ్టింగ్‌లో నేషనల్‌ గోల్డ్‌మెడలిస్ట్‌. తనలాగే జ్ఞాన దివ్య కూడా జాతీయస్థాయిలో సత్తా చాటాలనే ఉద్దేశంతో చక్కని తర్ఫీదునిచ్చారు. నాగశిరీష, ఆళ్ల వెంకటరెడ్డి, సోమిశెట్టి కోటేశ్వరరావు, సుభాన్‌వలి తదితర లిఫ్టర్ల సలహాలతో దివ్య అనేక పతకాలు సాధించింది.   


దివ్య విజయాలు ఇవీ..  

► 2021 నవంబరు 21, 22 తేదీల్లో జగ్గయ్యపేటలో జరిగిన స్టేట్‌మీట్‌ క్లాసిక్‌ కేటగిరీలో బంగారు పతకం.
 
► కేరళలోని అలప్పుజలో జరిగిన జాతీయస్థాయి 84 ప్లస్‌ కేటగిరీలో బంగారు పతకం.   

► అనకాపల్లిలో జరిగిన దక్షిణ భారత పోటీల్లో ఎక్విప్డ్‌ విభాగంలో రజతం.
 
► మంగళగిరిలో గత జూన్‌ 9న జరిగిన స్టేట్‌మీట్‌ ఎక్విప్డ్‌లో 84 ప్లస్‌ విభాగం స్క్వాడ్‌లో 187.5 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 160 కిలోలు, బెంచ్‌ ప్రెస్‌లో 55 కిలోల బరువులనెత్తి బంగారు పతకాలు కైవసం.  

► హైదరాబాద్‌లో ఈనెల 5న జరిగిన నేషనల్‌ సెలక్షన్స్‌లో స్క్వాడ్‌లో బంగారు, బెంచ్‌ప్రెస్, డెడ్‌లిఫ్ట్‌లో రజత పతకాలు.  

► ఈనెల 16న విశాఖపట్టణంలో జరిగిన 9వ రాష్ట్రస్థాయి క్లాసిక్‌ పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో బంగారు పతకం.  

► ఆగస్టు 12, 13, 14 తేదీల్లో కేరళలో జరగనున్న నేషనల్స్‌కు అర్హత. 

► ఆగస్టు ఆఖరు నుంచి టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌కు ఎంపిక. (క్లిక్: సీసాల పడవ.. భలే ఉందిరా బుల్లోడా!)

మరిన్ని వార్తలు