Virat Kohli: విరుష్కకు శుభాకాంక్షల వెల్లువ.. సచిన్‌ పోస్ట్‌ వైరల్‌

21 Feb, 2024 09:47 IST|Sakshi

Virat Kohli And Anushka Sharma Son Akaay: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి- బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మల కుటుంబంలోకి మరో కొత్త సభ్యుడు వచ్చాడు. తమ గారాలపట్టి వామికకు చిట్టి తమ్ముడినిచ్చింది విరుష్క జంట. ఈ నేపథ్యంలో క్రీడా, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఈ జోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘అకాయ్.. మీ అందమైన కుటుంబంలో అడుగుపెట్టిన అత్యంత విలువైన వ్యక్తి. శుభాకాంక్షలు విరాట్‌, అనుష్క.

ప్రకాశించే చంద్రుడన్న అర్థం గల తన పేరు లాగే అతడు.. మీ ప్రపంచాన్ని సంతోషం, అందమైన జ్ఞాపకాలతో నింపేయాలి. లిటిల్‌ చాంప్‌.. ఈ ప్రపంచంలోకి నీకు స్వాగతం’’ అని విరుష్కను విష్‌ చేశాడు.

ఇండియా హాయిగా నిద్రపోతుంది
ఇక కోహ్లి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంఛైజీ తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది. ‘‘ఇప్పుడు నలుగురు సభ్యులు.. అనుష్క, విరాట్‌లకు కంగ్రాట్స్‌.

ఆర్సీబీ కుటుంబంలోకి అకాయ్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అత్యంత సంతోషకరమైన వార్త ఇది. ఈరోజు ఇండియా మొత్తం హాయిగా నిద్రపోతుంది’’ అని ఆర్సీబీ ట్వీట్‌ చేసింది. అదే విధంగా ముంబై ఇండియన్స్‌ సహా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌, వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ తదితరులు విరుష్కను విష్‌ చేశారు.

ఫిబ్రవరి 15న జననం
కాగా గత గురువారమే తన భార్య అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చినట్టు, కుమారుడికి ‘అకాయ్‌’గా నామకరణం చేసినట్లు కోహ్లి సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. ‘ఫిబ్రవరి 15న మా జీవితాల్లోకి వామిక సోదరుడు అకాయ్‌ వచ్చాడు. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాం. 

ఈ ఆనందకర క్షణాల్లో మీ దీవెనలు మాకు కావాలి. మా ఏకాంతాన్ని గౌరవించండి’ అని కోహ్లి విజ్ఞప్తి చేశాడు. కోహ్లి, అనుష్కకు 2017 డిసెంబర్‌లో వివాహం కాగా... 2021 జనవరిలో కూతురు వామిక పుట్టింది. వ్యక్తిగత కారణాలతోనే కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు.

అయితే, సిరీస్‌కు దూరంగా ఉండటానికి గల అసలు కారణం వెల్లడికాకపోవడంతో విరాట్‌ తల్లికి అనారోగ్యం, అనుష్క ప్రెగ్నెన్సీలో ఇబ్బందులు అంటూ వివిధ రకాలుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఈమేరకు ట్వీట్‌ చేయడం గమనార్హం.

చదవండి: Shoaib Malik’s 3rd wife: షోయబ్‌ మాలిక్‌ భార్యకు చేదు అనుభవం

whatsapp channel

మరిన్ని వార్తలు