ఇదే నా నిరసన... 

28 Aug, 2020 02:49 IST|Sakshi

సిన్సినాటి ఓపెన్‌ టోర్నీ నుంచి మధ్యలోనే వైదొలిగిన టెన్నిస్‌ స్టార్‌ నయోమి ఒసాకా

అమెరికా నల్ల జాతీయుడు జేకబ్‌ బ్లేక్‌కు మద్దతుగా పోరాటం

న్యూయార్క్‌: అమెరికాలోని విస్కాన్సిన్‌ రాష్ట్రంలో పట్టపగలే నల్లజాతి వ్యక్తి జాకబ్‌ బ్లేక్‌పై పోలీసుల కాల్పుల ఘటన నిరసన సెగలు టెన్నిస్‌ ప్రపంచాన్నీ తాకాయి. జేకబ్‌కు మద్దతుగా వెస్టర్న్‌ అండ్‌ సదరన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ (సిన్సినాటి ఓపెన్‌) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రపంచ పదో ర్యాంకర్‌ నయోమి ఒసాకా (జపాన్‌) ప్రకటించింది. ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన 22 ఏళ్ల ఒసాకా జాతి వివక్షకు వ్యతిరేకంగా తన గళమెత్తింది. అథ్లెట్‌ కన్నా ముందు నల్లజాతి మహిళగా అన్యాయంపై పోరు కోసమే టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు 2018 యూఎస్‌ ఓపెన్, 2019 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల చాంపియన్‌ అయిన ఒసాకా ట్విట్టర్‌లో పేర్కొంది. ‘నేను ఈ మ్యాచ్‌ ఆడనంత మాత్రాన ఏదో అద్భుతం జరుగుతుందని అనుకోవట్లేదు. కానీ శ్వేత జాతీయుల ఆధిపత్యం ఉండే టెన్నిస్‌లో నా గళాన్ని వినిపిస్తే కాస్తయినా ఈ అంశంపై కదలిక వస్తుందని భావిస్తున్నా’ అని ఆమె రాసుకొచ్చింది.

ఆమెకు సహచరుల నుంచి మద్దతు లభించడంతో నిర్వాహకులు టోర్నీని ప్రస్తుతానికి నిలిపివేశారు. దీంతో గురువారం జరగాల్సిన సెమీఫైనల్‌ పోటీలు ఒకరోజు పాటు ఆగిపోయాయి. వర్ణ వివక్షపై పోరు, సామాజిక న్యాయం కోసం పాటుపడే టెన్నిస్‌ క్రీడ మరోసారి దానికే కట్టుబడి ఉందని పేర్కొన్న యునైటెడ్‌ స్టేట్స్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ (యూఎస్‌టీఏ), అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ), మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) వర్గాలు జేకబ్‌కు మద్దతుగా నిలుస్తున్నామని ప్రకటించాయి. ఈ టోర్నీ క్వార్టర్స్‌ ఫైనల్లో ఒసాకా 4–6, 6–2, 7–5తో అనెట్‌ కొంటావీ (ఎస్తోనియా)పై, యోహానా కొంటా (బ్రిటన్‌) 6–4, 6–3తో మారియా సాకరి (గ్రీస్‌)పై గెలుపొందారు. మరోవైపు నల్లజాతీయులకు న్యాయం జరగాలంటూ అథ్లెట్లు డిమాండ్‌ చేయడంతో బుధవారం నాటి ఎన్‌బీఏ, డబ్ల్యూఎన్‌బీఏ, బేస్‌బాల్, సాకర్‌ లీగ్‌లు మ్యాచ్‌లన్నీ వాయిదా పడ్డాయి.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు