ఓటమి తట్టుకోలేకపోయాడు.. గొడవ పడిన టెన్నిస్‌ స్టార్లు

30 Sep, 2022 17:03 IST|Sakshi

మ్యాచ్‌లో ఎన్ని గొడవలైనా విజయం అనంతరం షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకునే సమయంలో అంతా మరిచిపోయి కలిసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇద్దరు టెన్నిస్‌ ఆటగాళ్లు మాత్రం తాము ఆడుతుంది ఒక ప్రొఫెషనల్‌ గేమ్‌ అన్న సంగతి మరిచిపోయి బూతులు తిట్టుకున్నారు. చైర్‌ అంపైర్‌ వచ్చి అడ్డుకోకపోయి ఉంటే కచ్చితంగా కొట్టుకునేవారే. ఇదంతా ఓర్లీన్స్‌ చాలెంజర్‌ టోర్నమెంట్‌లో చోటుచేసుకుంది. టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ మౌటెట్‌, 247వ ర్యాంకర్‌ ఆండ్రీవ్‌లు తలపడ్డారు. కాగా మౌటెట్‌ను 2-6, 7-6(7-3), 7-6(7-2)తో ఆండ్రీవ్‌ ఖంగుతినిపించాడు. 

ఈ ఓటమిని మౌటెట్‌ జీర్ణించుకోలేకపోయాడు. మ్యాచ్‌ అనంతరం షేక్‌ హ్యాండ్‌ ఇచ్చే క్రమంలో మౌటెట్‌ తొలుత బాగానే ఉన్నప్పటికి.. ఆ తర్వాత ఆండ్రీవ్‌ను బూతులు తిట్టాడు. ఇది ఊహించని ఆండ్రీవ్‌ మౌటెట్‌కు ఎదురెళ్లాడు. ఇద్దరు ఒకరినొకరు మాటామాట అనుకున్నారు. గొడవ పెద్దగా మారుతుందన్న తరుణంలో చైర్‌ అంపైర్‌ వచ్చి ఇద్దరికి సర్థిచెప్పాడు. దీంతో ఆండ్రీవ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మౌటెట్‌ మ్యాచ్‌ను పాజిటివ్‌ నోట్‌తోనే ఆరంభించాడు. తొలి సెట్‌ను కూడా 20 నిమిషాల్లోనే కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో సెట్‌ నుంచి ఫుంజుకున్న ఆండ్రీవ్‌ మ్యాచ్‌ను టైబ్రేక్‌ తీసుకెళ్లాడు. టై బ్రేక్‌లో 7-3తో గెలిచి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత కీలకమైన మూడో సెట్‌లో కూడా ఇద్దరు హోరాహోరీగా తలపడడంతో మరోసారి టై బ్రేక్‌కు దారి తీసింది. ఈసారి కూడా టై బ్రేక్‌లో విజృంభించిన ఆండ్రీవ్‌ 7-2తో సెట్‌తో మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.

ఇక ఆండ్రీవ్‌పై దురుసుగా ప్రవర్తించడంపై మౌటెట్‌ స్పందించాడు. ''మ్యాచ్‌ తర్వాత నేను చేసింది తప్పే కావొచ్చు. కానీ ఎవరికి క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముందు ఆండ్రీవ్‌ నావైపు చూస్తూ బూతులు తిట్టాడు.. అందుకే ఆ సమయంలో నేను అలా రియాక్ట్‌ అవ్వాల్సి వచ్చింది.'' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: పికిల్‌బాల్‌ ఎప్పుడైనా విన్నారా.. అమెరికాలో ఎందుకంత క్రేజ్‌!

మరిన్ని వార్తలు