-

పోరాడి ఓడిన లక్ష్యసేన్‌

4 Jun, 2023 06:08 IST|Sakshi

థాయ్‌లాండ్‌ ఓపెన్‌

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో భారత పోరాటం ముగిసింది. ఏకైక ఆశాకిరణం లక్ష్యసేన్‌ కూడా సెమీ ఫైనల్లో ఓడిపోయాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో భారత షట్లర్‌ లక్ష్యసేన్‌ 21–13, 17–21, 13–21తో థాయ్‌లాండ్‌కు చెందిన రెండో సీడ్‌ కున్లావుత్‌ వితిద్సర్న్‌ చేతిలో పోరాడి ఓడాడు. గంటా 15 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 21 ఏళ్ల భారత ఆటగాడు తొలి గేమ్‌లో సీడెడ్‌ ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచాడు.

ఆరంభంలో 11–6 స్కోరు వద్ద పైచేయి సాధించాడు. కానీ థాయ్‌ ఆటగాడు వరుసగా నాలుగు పాయింట్లు చేశాడు. అయితే దీటుగా ఆడిన లక్ష్యసేన్‌ వరుసగా ఐదు పాయింట్లు సాధించాడు. అక్కడినుంచి గేమ్‌ తన నియంత్రణలోనే ముగిసింది. రెండో గేమ్‌ అయితే నువ్వానేనా అన్నట్లు సాగింది. కున్లావుత్‌ క్రాస్‌కోర్ట్‌ స్మాష్‌లతో పదును పెంచగా... దీటుగా ఎదుర్కొన్న భారత ఆటగాడు సుదీర్ఘ ర్యాలీలతో సత్తా చాటుకున్నాడు. స్థానిక షట్లర్‌ 12–10 వద్ద ఉన్నప్పుడు వరుసగా నాలుగు పాయింట్లు సాధించి జోరు పెంచినా చివరకు గేమ్‌ ప్రత్యర్థికే దక్కింది. నిర్ణాయక మూడో గేమ్‌లో లక్ష్యసేన్‌ పోరాడినా... కున్లావుత్‌ జోరు ముందు సేన్‌ ఆట ఫలితమివ్వలేదు.

మరిన్ని వార్తలు