Ind Vs Eng: వాళ్లిద్ద‌రి అధ్యాయం ఇక ముగిసిన‌ట్లే!

15 Jan, 2024 21:52 IST|Sakshi

అజింక్య ర‌హానే, ఛ‌తేశ్వ‌ర్ పుజారా టెస్టు కెరీర్ అధ్యాయం ముగిసిపోయిన‌ట్లేన‌ని భార‌త మాజీ ఓపెన‌ర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం బీసీసీఐ ప్ర‌క‌టించిన జ‌ట్టుతో ఈ విష‌యం నిరూపిత‌మైంద‌ని పేర్కొన్నాడు. ఇక ముందు ఈ వెట‌ర‌న్ బ్యాట‌ర్లు టీమిండియా త‌ర‌ఫున ఆడే అవ‌కాశం లేద‌న్నాడు.

కాగా ఒక‌ప్పుడు టెస్టు స్పెష‌లిస్టులుగా టీమిండియాకు ప‌లు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించారు ర‌హానే, పుజారా. వైస్ కెప్టెన్‌గా ర‌హానే.. న‌యావాల్‌గా పుజారా త‌మ వంతు పాత్ర‌ల‌ను చ‌క్క‌గా పోషించారు. కానీ గ‌త కొన్ని రోజులుగా వీరిద్ద‌రిని ప‌క్క‌న పెట్టేశారు సెల‌క్ట‌ర్లు.

అడ‌పాద‌డ‌పా వ‌చ్చిన అవ‌కాశాల‌ను ర‌హానే, పుజారా స‌ద్వినియోగం చేసుకోక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. మ‌రోవైపు.. యంగ్ క్రికెట‌ర్ల నుంచి ఎదుర‌వుతున్న పోటీలోనూ వీరు వెనుక‌బ‌డిపోయారు. దీంతో ఇటీవ‌ల సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న రూపంలో బిగ్ సిరీస్ నేప‌థ్యంలో ర‌హానే, పుజారాల‌ను సెల‌క్ట‌ర్లు ప‌ట్టించుకోలేదు. తాజాగా స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ప్ర‌క‌టించిన రెండు మ్యాచ్‌ల జ‌ట్టులోనూ చోటివ్వ‌లేదు.

వాళ్లిద్ద‌రిది ముగిసిన అధ్యాయం
ఈ నేప‌థ్యంలో ఆకాశ్ చోప్రా త‌న యూట్యూబ్ చానెల్ వేదిక‌గా మాట్లాడుతూ.. "ఊహించిన విధంగానే జ‌ట్టు ప్ర‌క‌ట‌న ఉంది. అజింక్య ర‌హానే, ఛ‌తేశ్వ‌ర్ పుజారాల‌ను ఎంపిక చేయ‌లేదు. ఇక వాళ్లిద్ద‌రిది ముగిసిన అధ్యాయం. ఎప్పుడైతే సౌతాఫ్రికాతో ఆడే జ‌ట్టులో వారికి స్థానం ఇవ్వ‌లేదో అప్పుడే ఇక ముందు కూడా వాళ్ల‌కు ఆడే అవ‌కాశం రాద‌ని ఊహించాను.

అక్క‌డ ధోని కెప్టెన్ కాబ‌ట్టి
టీమిండియా దారులు మూసుకుపోయినా ర‌హానేకు మాత్రం ఐపీఎల్ అవ‌కాశాలు స‌జీవంగానే ఉన్నాయి. చెన్నై సూప‌ర్ కింగ్స్ కు అత‌డు గ‌త సీజ‌న్‌లో ఆడాడు. ఈసారి కూడా బాగా ఆడితే మ‌రికొన్నాళ్ల‌పాటు కొన‌సాగ‌గ‌ల‌డు. నిజానికి చెన్నైకి ఆడ‌టం ముఖ్యం కాదు.. అక్క‌డ ధోని కెప్టెన్ కాబ‌ట్టి ఆ జ‌ట్టుకు ఆడి నిరూపించుకుంటే మ‌ళ్లీ టీమిండియా త‌లుపు త‌ట్ట‌వ‌చ్చు" అని అభిప్రాయ‌ప‌డ్డాడు.

కాగా ఆస్ట్రేలియాలో చారిత్రాత్మ‌క విజ‌యం త‌ర్వాత ర‌హానే వ‌రుస‌గా విఫ‌ల‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌-2023లో చెన్నైకి ఆడిన అత‌డు ఫుల్‌ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఈ నేప‌థ్యంలో చాలాకాలం త‌ర్వాత ప్ర‌పంచ టెస్టు చాంపియ‌న్‌షిప్ 2021-23 ఫైన‌ల్ సంద‌ర్భంగా టీమిండియాకు ఆడే చాన్స్ వ‌చ్చింది. 

మిగ‌తా వాళ్లంతా విఫ‌ల‌మైనా
ఇంగ్లండ్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో మిగ‌తా వాళ్లంతా విఫ‌ల‌మైనా ర‌హానే మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. అయితే, పుజారా మాత్రం పూర్తిగా నిరాశ‌ప‌రిచాడు.  ఈక్ర‌మంలో వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే జ‌ట్టులో ర‌హానేకు చోటు ద‌క్కినా.. పుజారాకు మొండిచేయి ఎదురైంది.

పుజారా డ‌బుల్ సెంచ‌రీ
అయితే, క‌రేబియ‌న్ గ‌డ్డ‌పై పాత క‌థ‌ను రిపీట్ చేసిన ర‌హానే మ‌ళ్లీ టీమిండియాలో స్థానం సంపాదించ‌లేక‌పోయాడు. ఇక పుజారా సంగ‌తి స‌రేస‌రి.  ఇంగ్లండ్ కౌంటీల్లో రాణిస్తున్నా సెల‌క్టర్లు క‌రుణించ‌డం లేదు. తాజాగా రంజీ ట్రోఫీ-2024లో ఆరంభ మ్యాచ్‌లో పుజారా డ‌బుల్ సెంచ‌రీతో సౌరాష్ట్ర త‌ర‌ఫున స‌త్తా చాట‌గా.. ముంబై కెప్టెన్ ర‌హానే మాత్రం డ‌కౌట్ అయ్యాడు.

>
మరిన్ని వార్తలు