ఇవాళ అదే వర్కౌట్‌ అయ్యింది: కోహ్లి

4 Dec, 2020 18:19 IST|Sakshi

కాన్‌బెర్రా: ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 11 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. ఆసీస్‌కు తొలి టీ20లోనే షాకిచ్చింది.   ఈ మ్యాచ్‌లో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డ్‌లోకి వచ్చిన స్పిన్నర్‌  యజ్వేంద్ర చహల్‌.. భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు కీలక వికెట్లు సాధించి జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. మ్యాచ్‌లో విజయం తర్వాత చహల్‌ను కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా తీసుకోవడంపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాట్లాడాడు. ‘ చహల్‌ను గేమ్‌లోకి తీసుకోవడానికి మేము ముందుగా ఎటువంటి ప్రణాళికలు వేసుకోలేదు. కాంకషన్‌ రిప్లేస్‌మెంట్‌ అనేది కొత్త అనుభవం. ఇవాళ మాకు అదే వర్కౌట్‌ అయ్యింది. (కాంకషన్‌గా వచ్చి గెలిపించాడు..!)

ప్రత్యర్థి జట్టుకు చహల్‌ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే ఆసీస్‌కు ఆరంభం బాగుంది. కానీ ఒత్తిడికి లోనై ఓటమి పాలయ్యారు. వారికి వారుగా స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయారు. అదే టీ20 క్రికెట్‌. ఆస్ట్రేలియాలో ఆట అనేది చాలా కఠినంగా ఉంటుంది. కడవరకూ పోరాటం సాగిస్తేనే గెలుస్తాం. నటరాజన్‌ ప్రతీ మ్యాచ్‌కు మెరగవుతున్నాడు. చహర్‌ కూడా బౌలింగ్‌ బాగా వేశాడు. కాకపోతే మ్యాచ్‌ తిరిగి చేతుల్లోకి రావడానికి కారణం మాత్రం చహలే. ఈ మ్యాచ్‌లో ఫించ్‌ ఇచ్చిన క్యాచ్‌ను హార్దిక్‌ అందుకున్న తీరు అమోఘం. అదే మ్యాచ్‌లో టర్నింగ్‌ పాయింట్‌’ అని తెలిపాడు.(చహల్‌పై ఆసీస్‌ అభ్యంతరం)

మరిన్ని వార్తలు