Asia Cup 2023: అదే గనుక జరిగితే అఫ్గనిస్తాన్‌ను ఎవరూ ఆపలేరు.. ప్రత్యర్థికి చుక్కలే!

29 Aug, 2023 11:08 IST|Sakshi
అఫ్గన్‌ క్రికెట్‌ జట్టు (PC: ACB)

Asia Cup 2023: అఫ్గనిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు స్పిన్నర్లే ప్రధాన బలమని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ఒకవేళ స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు గనుక వారికి లభిస్తే ప్రత్యర్థి జట్లకు కష్టాలు తప్పవని హెచ్చరించాడు. పాకిస్తాన్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఆసియా కప్‌-2023 బుధవారం(ఆగష్టు 30) ఆరంభం కానుంది.

గ్రూప్‌-బిలో అఫ్గనిస్తాన్‌
ఈ వన్డే టోర్నీలో గ్రూప్‌-ఏలో భారత్‌, పాకిస్తాన్‌, నేపాల్‌ ఉండగా... గ్రూప్‌-బి నుంచి బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌ పోటీ పడనున్నాయి. ఈ క్రమంలో అఫ్గన్‌ క్రికెట్‌ బోర్డు ఆదివారం తమ జట్టును ప్రకటించింది. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ సహా ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, మహ్మద్‌ నబీతో పాటు నూర్‌ అహ్మద్‌కు ఈ 17 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది.

వాళ్లంతా కలిసి ప్రత్యర్థి జట్ల పని పడతారు
ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్‌ జట్టు ఎల్లప్పుడూ మెరుగ్గా బౌలింగ్‌ చేస్తుంది. వాళ్లకు గనుక స్పిన్‌ ఫ్రెండ్లీ వికెట్‌ దొరికితే ఇక అంతే సంగతులు. 

ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌.. అంతా కలిసి ప్రత్యర్థి జట్టు పని పట్టడం ఖాయం. ఒకవేళ పిచ్‌ పూర్తిగా స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించిందంటే.. తుదిజట్టులో నూర్‌ అహ్మద్‌ కూడా ఎంట్రీ ఇస్తాడు.

ఊపిరి కూడా తీసుకోనివ్వరంటే అతిశయోక్తి కాదు
అహ్మద్‌ను గనుక ఆడిస్తే.. అతడితో పాటు రషీద్‌, నబీ, ముజీబ్‌ ఒక్కొక్కరు పది ఓవర్లు వేస్తారు. ప్రత్యర్థి జట్టుకు ఊపిరి సలపనివ్వకుండా చెలరేగిపోతారు’’ అని అఫ్గన్‌ స్పిన్‌ దళాన్ని ఆకాశానికెత్తాడు. అయితే, అఫ్గన్‌కు చెప్పుకోదగ్గ పేసర్లు లేకపోవడం మాత్రం బలహీనతే అని ఆకాశ్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.

ఆ ముగ్గురి రికార్డు ఇలా
కాగా ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా ఎదుగుతున్న రషీద్‌ ఖాన్‌ ఇప్పటి వరకు 87 వన్డేల్లో 170 వికెట్లు కూల్చాడు. ఇక ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ 64 మ్యాచ్‌లలో 91, మహ్మద్‌ నబీ 145 మ్యాచ్‌లు ఆడి 154 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌లో భాగంగా సెప్టెంబరు 3న బంగ్లాదేశ్‌తో లాహోర్‌లో అఫ్గన్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

ఆసియా కప్‌-2023 అఫ్గనిస్తాన్‌ జట్టు ఇదే
హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీ ఖిల్, కరీం జనత్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్‌ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూఖీ, షరాఫుద్దీన్ అష్రఫ్, నూర్ అహ్మద్, అబ్దుల్ రెహ్మాన్, మహ్మద్ సలీం.

చదవండి: ఇష్టాయిష్టాలతో పనిలేదు.. ఆరోజు యువరాజ్‌ సింగ్‌ నన్ను ఓదార్చాడు: రోహిత్‌ 

మరిన్ని వార్తలు