-

రనౌట్‌ కోసం థర్డ్‌ అంపైర్‌కు అప్పీల్‌; స్క్రీన్‌పై మ్యూజిక్‌ ఆల్బమ్‌

20 Aug, 2021 10:06 IST|Sakshi

జమైకా: పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగిన సంగతి తెలిసిందే. చివరి వరకూ ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో విండీస్ జట్టు వికెట్ తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. కాగా విండీస్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్‌ 77వ ఓవర్‌లో విండీస్‌ కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌ రనౌట్‌ విషయంలో థర్ఢ్‌ అంపైర్‌ను ఆశ్రయించారు.

ఆ సమయంలో బ్రాత్‌వైట్‌ 97 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. రిప్లేలో బ్రాత్‌వైట్‌ ఔటైనట్లు కనిపించింది. కానీ సంప్రదాయం ప్రకారం బిగ్‌స్క్రీన్‌పై చూపించడం ఆనవాయితీ. కాగా థర్ఢ్‌ అంపైర్‌ డెసిషన్‌ కోసం అందరూ స్ర్కీన్‌ వైపే చూస్తున్నారు. అలాంటి సమయంలో స్ర్కీన్‌పై మ్యూజిక్‌ ఆల్బమ్‌ కనిపించింది. దీంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు ప్రేక్షకుల మొహాల్లోనూ నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు ఒక లుక్కేయండి.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. పాక్‌ నిర్దేశించిన 168 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో విండీస్ జట్టు తడబడినప్పటికీ.. ఆఖర్లో కీమర్ రోచ్ (52 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు) సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. 142 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినా.. జోమెల్ వారికన్ (6), జేడెన్ సీల్స్ (2) అండతో రోచ్ తన జట్టును గట్టెక్కించాడు. ఈ విజయంతో విండీస్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగష్టు 20న ప్రారంభం కానుంది.
చదవండి: Test Cricket: కోహ్లిని ‘అధికార ప్రతినిధి’ని చేయండి!

మరిన్ని వార్తలు