అత్యుత్తమ టి20 జట్టు ఎంపిక.. సొంత జట్టు ఆటగాళ్లకు నో చాన్స్‌

2 Feb, 2022 21:23 IST|Sakshi

శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్‌ తిసార పెరీరా తన 11 మందితో కూడిన అత్యుత్తమ టి20 జట్టును ప్రకటించాడు. అయితే ఆశ్యర్యంగా తన సొంత జట్టు నుంచి ఒక్క ఆటగాడికి కూడా పెరీరా చోటు ఇవ్వకపోవడం విశేషం. పెరీరా ప్రకటించిన 11 మందిలో నలుగురు టీమిండియా నుంచి.. వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు చొప్పున.. అఫ్గానిస్తాన్‌ నుంచి ఒక ఆటగాడిని ఎంపిక చేశాడు.


టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని కెప్టెన్‌గా.. వికెట్‌కీపర్‌గా ఎంపిక చేశాడు. ఇక క్రిస్‌ గేల్‌, రోహిత్‌ శర్మ  ఓపెనర్లుగా.. విరాట్‌ కోహ్లి మూడో స్థానంలో.. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్‌, డేవిడ్‌ మిల్లర్‌లకు మిడిలార్డర్‌లో చోటు ​కల్పించాడు. ఇక స్పిన్నర్లుగా రషీద్‌ ఖాన్‌, సునీల్‌ నరైన్‌లను ఎంపిక చేసిన పెరీరా.. పేస్‌ విభాగంలో జస్‌ప్రీత్‌ బుమ్రా, మిచెల్‌ స్టార్క్‌, షాన్‌ టైట్‌లను ఏంచుకున్నాడు. 

పెరీరా టి20 అత్యుత్తమ జట్టు: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, AB డివిలియర్స్, డేవిడ్ మిల్లర్, ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌ & వికెట్‌ కీపర్‌), రషీద్ ఖాన్, సునీల్ నరైన్, జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్, షాన్ టైట్

చదవండి: Suranga Lakmal: టీమిండియతో సిరీస్‌ ఆఖరు.. రిటైర్‌ కానున్న స్టార్‌ క్రికెటర్‌

కాగా తిసారా పెరీరా శ్రీలంక తరపున 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన పెరీరా లంక తరపున 166 వన్డేల్లో 2338 పరుగులతో పాటు 175 వికెట్లు, 84 టి20ల్లో 1204 పరుగులు.. 61 వికెట్లు, 6 టెస్టుల్లో 203 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీశాడు. 2014 టి20 ప్రపంచకప్‌ గెలిచిన శ్రీలంక జట్టులో పెరీరా సభ్యుడిగా ఉన్నాడు. వన్డేలు, టి20ల్లో హ్యాట్రిక్‌ తీసిన రెండో బౌలర్‌గా పెరీరా చరిత్ర సృష్టించాడు. ఇక ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పెరీరా.. సౌతాఫ్రికాతో వన్డే మ్యాచ్‌లో రాబిన్‌ పీటర్సన్‌ బౌలింగ్‌లో ఒక ఓవర్‌లో 35 పరుగులు కొట్టి కొత్త రికార్డు సృష్టించాడు. మే 3, 2021న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పెరీరా 2017-19 మధ్య కాలంలో అన్ని ఫార్మాట్లకు లంక కెప్టెన్‌గా వ్యవహరించాడు.

మరిన్ని వార్తలు