నాకౌట్‌ దశకు భారత్‌ అర్హత

10 May, 2022 05:49 IST|Sakshi

థామస్‌ కప్‌ టోర్నీలో రెండో విజయం

బ్యాంకాక్‌: అగ్రశ్రేణి క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఈవెంట్‌లో తొలి లక్ష్యాన్ని పూర్తి చేసింది. గ్రూప్‌ ‘సి’లో భాగంగా సోమవారం కెనడా జట్టుతో జరిగిన రెండో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5–0తో ఘనవిజయం సాధించింది. వరుసగా రెండో గెలుపుతో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ (నాకౌట్‌ దశ)కు అర్హత పొందింది. గ్రూప్‌ ‘సి’లోని మరో మ్యాచ్‌లో చైనీస్‌ తైపీ 5–0తో జర్మనీని ఓడించి భారత్‌తోపాటు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. భారత్, చైనీస్‌ తైపీ మధ్య బుధవారం జరిగే లీగ్‌ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్‌ టాపర్‌గా నిలుస్తుంది.  

కెనడాతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ కిడాంబి శ్రీకాంత్‌ 20–22, 21–11, 21–15తో ప్రపంచ 29వ ర్యాంకర్‌ బ్రియాన్‌ యాంగ్‌ను 52 నిమిషాల్లో ఓడించి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 21–12, 21–11తో జేసన్‌ ఆంథోనీ–కెవిన్‌ లీ జంటపై గెలిచింది. మూడో మ్యాచ్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 21–15, 21–12తో సంకీర్త్‌ను ఓడించి భారత్‌కు 3–0తో ఆధిక్యాన్ని ఇవ్వడంతోపాటు విజయాన్ని ఖరారు చేశాడు. నాలుగో మ్యాచ్‌లో గారగ కృష్ణప్రసాద్‌–పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌ జోడీ 21–15, 21–11తో డాంగ్‌ ఆడమ్‌–ని యకూరా జంటపై నెగ్గింది. చివరిదైన ఐదో మ్యాచ్‌లో ప్రియాన్షు రజావత్‌ 21–13, 20–22, 21–14తో విక్టర్‌ లాయ్‌పై గెలవడంతో భారత్‌ 5–0తో కెనడాను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఉబెర్‌ కప్‌లో భాగంగా నేడు భారత మహిళల జట్టు తమ రెండో లీగ్‌ మ్యాచ్‌లో అమెరికాతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

మరిన్ని వార్తలు