ఇంకేం చేస్తాం... వాయిదా వేస్తాం

16 Sep, 2020 06:58 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ భయానికి ఒక్కో జట్టు తప్పుకుంటోంది. ‘మేం ఆడమంటే ఆడబోమని’ చెప్పే దేశాల సంఖ్య చాంతాడంత కావడంతో ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) చేసేదేమీ లేక... చేతులెత్తేసింది. ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌–ఉబెర్‌ కప్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. ముందనుకున్న షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెల అక్టోబర్‌ 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లోని అర్హస్‌లో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. దీని కోసం భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) పురుషులు, మహిళల జట్లను కూడా ఎంపిక చేసింది.

మరోవైపు మాత్రం ఒక్కో దేశం టోర్నీ నుంచి తప్పుకుం టోంది. థాయ్‌లాండ్, ఆ్రస్టేలియా, చైనీస్‌ తైపీ, అల్జీరియా, 16 సార్లు చాంపియన్‌ ఇండోనేసియా, దక్షిణకొరియా ఆడబోమని చెప్పేశాయి. ఇలా మేటి జట్లన్నీ తప్పుకుంటే ప్రతిష్టాత్మక టోర్నీ ప్రభ కోల్పోతుందని భావించిన బీడబ్ల్యూఎఫ్‌ ఈవెంట్‌నే వాయిదా వేసింది. ‘ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ఆతిథ్య దేశంతో పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపిన మీదట టోర్నీని వాయిదా వేసింది. ఈ టోర్నమెంట్‌ను వచ్చే ఏడాది నిర్వహిస్తాం’ అని బీడబ్ల్యూఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. నిజానికి ఈ టోర్నీని ఎలాగొలా నిర్వహించాలనే బీడబ్ల్యూఎఫ్‌ ప్రయత్నించింది. ప్రత్యామ్నాయ వేదికగా సింగపూర్, హాంకాంగ్‌లను పరీశిలించింది. కానీ ఆ రెండు దేశాలు నిర్వహణకు అంగీకరించలేదు. దీంతో పాటు జపాన్, చైనాలు కూడా ఈవెంట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో బీడబ్ల్యూఎఫ్‌ ఈ మెగా ఈవెంట్‌ వాయిదాకే మొగ్గు చూపింది. 

మరిన్ని వార్తలు