క్రీడాకారులకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరి కాదు

18 Nov, 2020 04:42 IST|Sakshi

వేయించుకోకున్నా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనవచ్చు

ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ స్పష్టీకరణ

టోక్యో : వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ విషయంలో వెసులుబాటు కల్పిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే వారు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ను వేయించుకోవడం తప్పనిసరేం కాదంటూ మంగళవారం వ్యాఖ్యానించారు. అంతేకాకుండా వ్యాక్సిన్‌ తీసుకోవడం అథ్లెట్ల నిర్ణయానికే వదిలేశారు. ‘ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఒలింపిక్స్‌ జరిగే నాటికి ఎన్ని వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తాయనే విషయంపై స్పష్టత లేదు. అంతేకాకుండా ఒక్కొక్కరిపై ఒక్కోలా వ్యాక్సిన్‌ తన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కొందరిలో ఇది దుష్ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది’ అంటూ థామస్‌ బాచ్‌ వ్యాఖ్యానించారు. అయితే తాము మాత్రం వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందిగా అథ్లెట్లను కోరతామని థామస్‌ పేర్కొనడం విశేషం. జపాన్‌లో మూడు రోజుల పర్యటనలో భాగంగా బాచ్‌ మంగళవారం టోక్యో ఒలింపిక్స్‌ ప్రధాన వేదిక నేషనల్‌ స్టేడియంతోపాటు క్రీడాకారులు బస చేసే క్రీడా గ్రామాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. టోక్యో ఒలింపిక్స్‌–2021 వచ్చే ఏడాది జూలై 23న మొదలవుతాయి.    

మరిన్ని వార్తలు