-

Thomas Cup 2022: భళా భారత్‌...

14 May, 2022 05:45 IST|Sakshi

థామస్‌ కప్‌ టోర్నీలో తొలిసారి ఫైనల్‌కు అర్హత

సెమీఫైనల్లో డెన్మార్క్‌పై 3–2తో విజయం

శ్రీకాంత్, ప్రణయ్‌ వీరోచిత ప్రదర్శన

సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి జోడీ అదుర్స్‌

రేపు ఇండోనేసియాతో టైటిల్‌ పోరు

బ్యాంకాక్‌లో భారత పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. 73 ఏళ్ల సుదీర్ఘ చరిత్రగల ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ టీమ్‌ టోర్నీలో భారత జట్టు తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2016 చాంపియన్‌ డెన్మార్క్‌తో హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో భారత్‌ 3–2తో గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో 14 సార్లు చాంపియన్‌ ఇండోనేసియాతో భారత్‌ అమీతుమీ తేల్చుకుంటుంది.

బ్యాంకాక్‌: థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టీమ్‌ టోర్నమెంట్‌లో భారత్‌ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 1949లో మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. మాజీ చాంపియన్‌ డెన్మార్క్‌ జట్టుతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 3–2తో విజయం సాధించింది. మరో సెమీఫైనల్లో 14 సార్లు విజేత ఇండోనేసియా 3–2తో మాజీ విజేత జపాన్‌ను ఓడించి ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది.  

సాత్విక్‌–చిరాగ్‌ చెలరేగి...
డెన్మార్క్‌తో పోటీని భారత్‌ ఓటమితో మొదలుపెట్టింది. భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 49 నిమిషాల్లో 13–21, 13–21తో ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం అద్భుత ఆటతీరు కనబరిచింది. 78 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–18, 21–23, 22–20తో కిమ్‌ ఆస్‌ట్రప్‌–మథియాస్‌ క్రిస్టియాన్సన్‌ జంటను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది.
 

ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు సాత్విక్‌–మహారాష్ట్ర ప్లేయర్‌ చిరాగ్‌ శెట్టి కీలకదశలో పాయింట్లు రాబట్టి పైచేయి సాధించారు. మూడో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌ తన శక్తినంతా ధారపోసి ఆడాడు. ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఆండెర్స్‌ ఆంటోన్సెన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 80 నిమిషాల్లో 21–18, 12–21, 21–15తో గెలుపొంది భారత్‌కు 2–1 ఆధిక్యాన్ని అందించాడు. పోటీలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో డెన్మార్క్‌ జట్టు రాణించింది. ఆండెర్స్‌ రస్‌ముసెన్‌–ఫ్రెడెరిక్‌ ద్వయం 21–14, 21–13తో పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌–గారగ కృష్ణప్రసాద్‌ జంటను ఓడించి స్కోరును 2–2తో సమం చేసింది.

ప్రణయ్‌ ప్రతాపం
స్కోరు 2–2తో సమం కావడంతో భారత ఆశలన్నీ ఐదో మ్యాచ్‌లో బరిలోకి దిగిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌పై ఆధారపడ్డాయి. మలేసియాతో క్వార్టర్‌ ఫైనల్లో చివరి మ్యాచ్‌లో గెలిచి భారత్‌ను సెమీస్‌కు చేర్చిన ప్రణయ్‌ ఈసారీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయలేదు. ప్రపంచ 13వ ర్యాంకర్‌ రస్‌ముస్‌ జెమ్కెతో జరిగిన మ్యాచ్‌లో 23వ ర్యాంకర్‌ ప్రణయ్‌ 73 నిమిషాల్లో 13–21, 21–9, 21–12తో గెలుపొంది భారత్‌ను తొలిసారి థామస్‌ కప్‌లో ఫైనల్‌కు చేర్చాడు. మ్యాచ్‌ మధ్యలో ప్రణయ్‌ చీలమండకు గాయమైనా ఆ బాధను ఓర్చుకుంటూ పట్టువదలకుండా పోరాడిన అతను భారత్‌కు మరో చిరస్మరణీయ విజయం కట్టబెట్టాడు.

మరిన్ని వార్తలు