Thomas Cup 2022: ఎన్నాళ్లో వేచిన పతకం

13 May, 2022 04:15 IST|Sakshi

థామస్‌ కప్‌లో భారత పురుషుల జట్టు కొత్త చరిత్ర

73 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారి పతకం ఖాయం

క్వార్టర్‌ ఫైనల్లో మలేసియాపై 3–2తో విజయం

నేడు జరిగే సెమీఫైనల్లో డెన్మార్క్‌తో ‘ఢీ’  

సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత పురుషుల జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఐదుసార్లు చాంపియన్‌ మలేసియా జట్టును క్వార్టర్‌ ఫైనల్లో ఓడించిన భారత్‌ 1979 తర్వాత ఈ మెగా ఈవెంట్‌లో మళ్లీ సెమీఫైనల్‌ చేరింది. తద్వారా 73 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత పురుషుల జట్టు తొలిసారి కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. 1990 నుంచి థామస్‌ కప్‌లో సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకూ కాంస్య పతకాలు అందజేస్తున్నారు. అంతకుముందు మాత్రం సెమీఫైనల్లో ఓడిన రెండు జట్ల మధ్య ప్రత్యేకంగా కాంస్య పతకం కోసం మ్యాచ్‌ను నిర్వహించేవారు.  

బ్యాంకాక్‌: అగ్రశ్రేణి క్రీడాకారులతో బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు అంచనాలకు అనుగుణంగా రాణించింది. గతంలో సాధ్యంకాని ఘనతను ఈసారి సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక టీమ్‌ ఈవెంట్‌ అయిన థామస్‌ కప్‌లో భారత పురుషుల జట్టు తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 3–2తో ఐదుసార్లు చాంపియన్‌ మలేసియా జట్టును ఓడించి సెమీఫైనల్‌ చేరింది. థామస్‌ కప్‌లో సెమీఫైనల్‌ చేరిన జట్లకు కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. నేడు జరిగే సెమీఫైనల్లో 2016 చాంపియన్‌ డెన్మార్క్‌ జట్టుతో భారత్‌ తలపడుతుంది. మరో సెమీఫైనల్లో ఇండోనేసియాతో జపాన్‌ ఆడుతుంది. ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో డెన్మార్క్‌ 3–2తో దక్షిణ కొరియాపై... జపాన్‌ 3–2తో చైనీస్‌ తైపీపై... ఇండోనేసియా 3–0తో చైనాపై విజయం సాధించాయి.  

గెలిపించిన ప్రణయ్‌
మలేసియాతో పోటీలో భారత్‌కు శుభారంభం దక్కలేదు. తొలి మ్యాచ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 21–23, 9–21తో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ లీ జి జియా చేతిలో ఓడిపోయాడు. అయితే రెండో మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట 21–19, 21–15తో గో జె ఫె– నూరుజుద్దీన్‌ జోడీని ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాత్విక్‌ సాయిరాజ్, మహారాష్ట్ర ఆటగాడు చిరాగ్‌ చక్కటి సమన్వయంతో ఆడుతూ మ్యాచ్‌ కొనసాగుతున్నకొద్దీ జోరు పెంచి ప్రత్యర్థి జోడీకి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

మూడో మ్యాచ్‌లో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్‌ 21–11, 21–17తో ఎన్జీ జె యోంగ్‌పై గెలిచి భారత్‌ను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. 41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ తొలి గేమ్‌లో చెలరేగిపోగా... రెండో గేమ్‌లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. నాలుగో మ్యాచ్‌లో పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌–గారగ కృష్ణప్రసాద్‌ జంట 19–21, 17–21తో ఆరోన్‌ చియా–తియో యె యి ద్వయం చేతిలో ఓడిపోవడంతో స్కోరు 2–2తో సమమైంది.

తెలంగాణ ప్లేయర్‌ విష్ణువర్ధన్‌ గౌడ్, ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు కృష్ణప్రసాద్‌ పోరాటపటిమ కనబరిచినా కీలకదశలో తడబడ్డారు. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆడి 21–13, 21–8తో లియోంగ్‌ జున్‌ హావోపై నెగ్గడంతో భారత్‌ 3–2తో చిరస్మరణీయ విజయాన్ని ఖరారు చేసుకుంది. స్కోరు 20–8 వద్ద ప్రణయ్‌ స్మాష్‌ షాట్‌ కొట్టి చివరి పాయింట్‌ రాబట్టిన వెంటనే భారత జట్టు సభ్యులందరూ ఆనందంతో కోర్టులోకి దూసుకెళ్లి సంబరాలు చేసుకున్నారు.

>
మరిన్ని వార్తలు