Thomas Cup 2022: షటిల్‌ కింగ్స్‌

16 May, 2022 06:00 IST|Sakshi

థామస్‌ కప్‌ భారత్‌ సొంతం

73 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారి ఘనత

ఫైనల్లో ఇండోనేసియాపై 3–0తో ఘనవిజయం

మెరిసిన లక్ష్య సేన్, సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి, శ్రీకాంత్‌

సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ప్రపంచ షటిల్‌ సామ్రాజ్యంలో మన జెండా ఎగిరింది. ప్రపంచ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌గా పేరున్న థామస్‌ కప్‌లో ఒకప్పుడు మనం ప్రాతినిధ్యానికే పరిమితమయ్యాం. ఒకట్రెండుసార్లు మెరిపించినా ఏనాడూ పతకం అందుకోలేకపోయాం. కానీ ఈసారి అందరి అంచనాలను పటాపంచలు చేశాం. ఏకంగా విజేతగా అవతరించాం. క్వార్టర్‌ ఫైనల్లో, సెమీఫైనల్లో సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ ఫైనల్లో 14 సార్లు చాంపియన్‌ ఇండోనేసియాకు విశ్వరూపమే చూపించాం.

క్వార్టర్‌ ఫైనల్లో, సెమీఫైనల్లో ఆఖరి మ్యాచ్‌లో ఫలితం తేలగా... టైటిల్‌ సమరంలో వరుసగా మూడు విజయాలతో ఇండోనేసియా కథను ముగించి మువ్వన్నెలు రెపరెపలాడించాం. భారత చరిత్రాత్మక విజయంలో తెలుగు తేజాలు కీలకపాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్‌ సింగిల్స్‌లో, డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్, గారగ కృష్ణప్రసాద్‌... తెలంగాణ ప్లేయర్‌ పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్, కోచ్‌ సియాదతుల్లా ఈ చిరస్మరణీయ విజయంలో భాగమయ్యారు.

బ్యాంకాక్‌: ఇన్నాళ్లూ వ్యక్తిగత విజయాలతో మురిసిపోయిన భారత బ్యాడ్మింటన్‌ ఇప్పుడు టీమ్‌ ఈవెంట్‌లోనూ అదరగొట్టింది. 73 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్‌ కప్‌ పురుషుల టీమ్‌ టోర్నమెంట్‌లో తొలిసారి భారత్‌ చాంపియన్‌గా అవతరించింది. ప్రకాశ్‌ పడుకోన్, సయ్యద్‌ మోడీ, విమల్‌ కుమార్, పుల్లెల గోపీచంద్‌లాంటి స్టార్స్‌ గతంలో థామస్‌ కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన వాళ్లే.

కానీ ఏనాడూ వారు ట్రోఫీని ముద్దాడలేకపోయారు. ఎట్టకేలకు వీరందరి కలలు నిజమయ్యాయి. అసాధారణ ఆటతీరుతో ఈసారి భారత జట్టు థామస్‌ కప్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌ 3–0తో 14 సార్లు చాంపియన్‌ ఇండోనేసియాను చిత్తు చేసి థామస్‌ కప్‌ను సొంతం చేసుకుంది. ‘బెస్ట్‌ ఆఫ్‌ ఫైవ్‌’ పద్ధతిలో జరిగిన ఫైనల్లో భారత్‌ వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి ఇండోనేసియాకు షాక్‌ ఇచ్చింది.  

శుభారంభం...
తొలిసారి థామస్‌ కప్‌ ఫైనల్‌ ఆడిన భారత్‌కు శుభారంభం లభించింది. ప్రపంచ ఐదో ర్యాంకర్‌ ఆంథోనీ జిన్‌టింగ్‌తో జరిగిన తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 65 నిమిషాల్లో 8–21, 21–17, 21–16తో విజయం సాధించి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. తొలి గేమ్‌లో తడబడిన లక్ష్య సేన్‌ ఆ తర్వాత చెలరేగి ఆంథోనీ ఆట కట్టించాడు. డబుల్స్‌ విభాగంలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇండోనేసియా ప్రపంచ నంబర్‌వన్‌ కెవిన్‌ సంజయ సుకముల్యో, రెండో ర్యాంకర్‌ మొహమ్మద్‌ అహసాన్‌లను బరిలోకి దించింది.

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ఆద్యంతం అద్భుత ఆటతీరుతో 73 నిమిషాల్లో 18–21, 23–21, 21–19తో సుకముల్యో–అహసాన్‌ జంటను బోల్తా కొట్టించి భారత్‌ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. మూడో మ్యాచ్‌గా జరిగిన రెండో సింగిల్స్‌లో 2018 జకార్తా ఆసియా క్రీడల చాంపియన్‌ జొనాథాన్‌ క్రిస్టీతో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ తలపడ్డాడు. 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 21–15, 23–21తో గెలుపొంది భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు.

ఈ టోర్నీ ప్రారంభం నుంచి కళ్లు చెదిరే ఆటతో ఆకట్టుకుంటున్న శ్రీకాంత్‌ ఈ మ్యాచ్‌లోనూ దానిని కొనసాగించాడు. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ జొనాథన్‌ క్రిస్టీతో ఈ ఏడాది ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ప్రపంచ 11వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ ఈసారి మాత్రం ఆరంభం నుంచే పైచేయి సాధించాడు. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన శ్రీకాంత్‌  రెండో గేమ్‌లో ఒకదశలో 13–16తో వెనుకబడ్డాడు. కానీ వెంటనే తేరుకున్న ఈ ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ స్కోరును సమం చేశాడు. అనంతరం 20–21తో వెనుకబడ్డ దశలో మళ్లీ కోలుకొని వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయా న్ని ఖాయం చేసుకున్నాడు. ఫలితం తేలిపోవడంతో మిగతా రెండు మ్యాచ్‌లను నిర్వహించలేదు.

మనం గెలిచాం ఇలా...
లీగ్‌ దశ: గ్రూప్‌ ‘సి’లో భారత జట్టు వరుసగా తొలి రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో జర్మనీపై 5–0తో... కెనడాపై 5–0తో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. చివరి మ్యాచ్‌ లో భారత్‌ 2–3తో చైనీస్‌ తైపీ చేతిలో ఓడి గ్రూప్‌ ‘సి’లో రెండో స్థానంలో నిలిచింది.  

క్వార్టర్‌ ఫైనల్‌: ఐదుసార్లు చాంపియన్‌ మలేసియాపై భారత్‌ 3–2తో గెలిచింది. 1979 తర్వాత మళ్లీ సెమీఫైనల్లోకి ప్రవేశించి తొలిసారి పతకాన్ని ఖాయం చేసుకుంది.  
సెమీఫైనల్‌: 2016 విజేత డెన్మార్క్‌పై భారత్‌ 3–2తో నెగ్గి ఈ టోర్నీ చరిత్రలో మొదటిసారి ఫైనల్‌కు అర్హత సాధించింది.

గెలుపు వీరుల బృందం...
థామస్‌ కప్‌లో భారత్‌ తరఫున మొత్తం 10 మంది ప్రాతినిధ్యం వహించారు. సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ (ఆంధ్రప్రదేశ్‌), లక్ష్య సేన్‌ (ఉత్తరాఖండ్‌), హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (కేరళ), ప్రియాన్షు రజావత్‌ (మధ్యప్రదేశ్‌) పోటీపడ్డారు. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌ (ఆంధ్రప్రదేశ్‌)–చిరాగ్‌ శెట్టి (మహారాష్ట్ర)... పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌ (తెలంగాణ)–గారగ కృష్ణప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌)... ఎం.ఆర్‌.అర్జున్‌ (కేరళ)–ధ్రువ్‌ కపిల (పంజాబ్‌) జోడీలు బరిలోకి దిగాయి.


నా అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. వ్యక్తిగత టోర్నీలతో పోలిస్తే టీమ్‌ ఈవెంట్లలో ఆడే అవకాశం తక్కువగా లభిస్తుంది. కాబట్టి ఇలాంటి పెద్ద ఘనతను అందుకోవడం నిజంగా గొప్ప ఘనతగా భావిస్తున్నా. మేం సాధించామని నమ్మేందుకు కూడా కొంత సమయం పట్టింది. జట్టులో ప్రతీ ఒక్కరు బాగా ఆడారు. ఏ ఒక్కరో కాకుండా పది మంది సాధించిన విజయమిది. టీమ్‌ విజయాల్లో ఉండే సంతృప్తే అది.
–కిడాంబి శ్రీకాంత్‌

‘అభినందనల జల్లు’
థామస్‌ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడి ప్రత్యేకంగా అభినందించారు. భారత్‌కు తిరిగి వచ్చాక తన ఇంటికి రావాలని ఆయన ఆహ్వానించారు. ‘భారత బ్యాడ్మింటన్‌ జట్టు చరిత్ర సృష్టించింది. థామస్‌ కప్‌ గెలుపుపై దేశమంతా హర్షిస్తోంది. మన జట్టుకు అభినందనలు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలి. ఈ గెలుపు వర్ధమాన ఆటగాళ్లకు స్ఫూర్తినందిస్తుంది’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ కూడా తొలిసారి థామస్‌ కప్‌ గెలిచిన భారత జట్టుకు అభినందనలు తెలియజేశారు.

తొలిసారి థామస్‌ కప్‌ గెలవడం భారత బ్యాడ్మింటన్‌కు చారిత్రాత్మక క్షణం. విజయం సాధించే వరకు పట్టు వదలకుండా, ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన కిడాంబి శ్రీకాంత్, భారత బృందానికి అభినందనలు. ప్రతిష్ట, సమష్టితత్వం కలగలిస్తేనే విజయం. చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్, చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్, ప్రణయ్‌లకు కూడా అభినందనలు.
–వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి

ఈ గెలుపు గురించి చెప్పేందుకు మాటలు రావడం లేదు. మా ఆటగాళ్లపై కొంత ఆశలు ఉన్నా ఇంత గొప్పగా ఆడతారని ఊహించలేదు. భారత క్రికెట్‌కు 1983 ప్రపంచకప్‌ ఎలాంటిదో ఇప్పుడు బ్యాడ్మింటన్‌కు ఈ టోర్నీ విజయం అలాంటిది.  
 –విమల్‌ కుమార్, భారత బ్యాడ్మింటన్‌ కోచ్‌

థామస్‌ కప్‌ విజయం చాలా పెద్దది. జనం దీని గురించి మున్ముందు చాలా కాలం మాట్లాడుకుంటారు. భారత బ్యాడ్మింటన్‌ గర్వపడే క్షణమిది. ఇకపై మన టీమ్‌ గురించి ప్రపంచం భిన్నంగా ఆలోచిస్తుంది. ఒకప్పుడు వ్యక్తిగత పతకాలు గెలవడం కలగా ఉండేది. ప్రిక్వార్టర్స్‌ చేరినా గొప్పగా అనిపించేది. ఇది వాటికి మించిన ఘనత. దానిని బట్టి చూస్తే ఈ టీమ్‌ ఎంత గొప్పగా ఆడిందో అర్థమవుతుంది.     
–పుల్లెల గోపీచంద్, భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌

రూ. 2 కోట్ల నజరానా
థామస్‌ కప్‌ గెలిచిన భారత జట్టుకు రూ. 2 కోట్లు నజరానా ప్రకటించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి రూ. 1 కోటి, భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) నుంచి రూ. 1 కోటి జట్టు సభ్యులకు ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు