Thomas Cup: స్పెయిన్‌తో మహిళలు... నెదర్లాండ్స్‌తో పురుషులు

10 Oct, 2021 10:11 IST|Sakshi

థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌

టోర్నీలో నేటి నుంచి భారత మ్యాచ్‌లు

అర్హస్‌ (డెన్మార్క్‌): ప్రతిష్టాత్మక థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. థామస్‌ కప్‌లో పురుషుల జట్టు... ఉబెర్‌ కప్‌లో మహిళల జట్టు మెరుగైన ప్రదర్శన చేసేందుకు సిద్ధమయ్యాయి. నేడు జరిగే తమ ఆరంభ పోటీల్లో గూప్‌ ‘సి’లో ఉన్న భారత పురుషుల టీమ్‌ నెదర్లాండ్స్‌తో... గ్రూప్‌ ’బి’లో ఉన్న మహిళల జట్టు స్పెయిన్‌తో తలపడనున్నాయి. కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, డబుల్స్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టిలతో కూడిన భారత పురుషుల టీమ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. గ్రూప్‌ ‘సి’లో పటిష్ట చైనా ఉన్నప్పటికీ... నెదర్లాండ్స్, తాహిటిలపై గెలవడం భారత్‌కు పెద్ద కష్టం కాకపోవచ్చు. పురుషుల, మహిళల విభాగాల్లో 16 జట్ల చొప్పున పోటీలో ఉండగా... వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు.

ప్రతి గ్రూప్‌లోనూ టాప్‌–2లో నిలిచిన రెండు జట్లు నాకౌట్‌ దశకు అర్హత సాధిస్తాయి. మహిళల టోర్నీ ఉబెర్‌ కప్‌లో భారత్‌ గ్రూప్‌ ‘బి’లో ఉంది. థాయ్‌లాండ్, స్పెయిన్, స్కాట్లాండ్‌ ప్రత్యర్థులు. రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు ఈ టోర్నీకి దూరమవ్వడం మహిళల జట్టుకు ప్రతికూల అంశం. సైనా నెహ్వాల్, గాయత్రి గోపిచంద్, డబుల్స్‌ జోడి అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డిల ఆటతీరుపైనే మహిళల జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఉబెర్‌ కప్‌లో భారత మహిళల జట్టు 2014, 2016లో సెమీస్‌ చేరింది. గతేడాది మేలో జరగాల్సిన ఈ టోర్నీ కరోనాతో వాయిదా పడింది. 

మరిన్ని వార్తలు