థామస్‌ కప్‌ విజయంపై పుల్లెల గోపీచంద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

16 May, 2022 10:16 IST|Sakshi

థామస్‌ కప్‌ 2022లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత పురుషుల బ్యాడ్మింటన్‌ బృందంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సామాన్య పౌరుల దాకా అందరూ టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తున్నారు. టీమిండియా సాధించిన అపురూప విజయంపై చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ స్పందిస్తూ.. బ్యాడ్మింటన్‌కు ఈ విజయం 1983 క్రికెట్‌ వరల్డ్‌కప్‌ విజయం కంటే గొప్పదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

అప్పట్లో ఏమాత్రం అంచనాలు లేకుండా వరల్డ్‌కప్‌ బరిలోకి దిగిన కపిల్‌ డెవిల్స్‌.. ప్రపంచ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిస్తే.. తాజాగా కిదాంబి శ్రీకాంత్‌ నేతృత్వంలోని టీమిండియా సైతం 14సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను 3-0తో చిత్తు చేసి బ్యాడ్మింటన్‌లో 73 ఏళ్ల భారత కలను సాకారం చేసిందని అన్నాడు. 

1983 వరల్డ్‌కప్‌ గెలిచాక భారత క్రికెట్‌ రూపురేఖలు ఎలా మారిపోయాయో.. థామస్‌ కప్‌ గెలుపుతో భారత బ్యాడ్మింటన్‌కు కూడా శుభ ఘడియలు మొదలయ్యాయని తెలిపాడు. థామస్‌ కప్‌ విజయం ఇచ్చిన స్పూర్తితో భారత షట్లర్లు మున్ముందు మరిన్ని సంచనాలు నమోదు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత బృందానికి నాయకత్వం వహించిన కిదాంబి శ్రీకాంత్‌ను గోపీచంద్‌ ప్రత్యేకంగా అభినందించాడు. 
చదవండి: Thomas Cup 2022: షటిల్‌ కింగ్స్‌
 

మరిన్ని వార్తలు