టిమ్‌ డేవిడ్‌ ఊచకోత.. ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌ ఖుషీ, అయినా..!

8 Mar, 2023 09:33 IST|Sakshi

PSL 2023: పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2023లో బ్యాటర్ల డామినేషన్‌ పతాక స్థాయిలో నడుస్తుంది. లీగ్‌లో ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు జరగ్గా దాదాపు అన్ని మ్యాచ్‌ల్లో బ్యాటర్లు శివాలెత్తిపోయారు. ఫలితంగా ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. నిన్న (మార్చి 7) ముల్తాన్‌ సుల్తాన్స్‌-ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ  పరుగుల ప్రవాహం కొనసాగింది.

ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు పోటాపోటీగా విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముల్తాన్‌ సుల్తాన్స్‌.. షాన్‌ మసూద్‌ (50 బంతుల్లో 75; 12 ఫోర్లు), మహ్మద్‌ రిజ్వాన్‌ (18 బంతుల్లో 33; ఫోర్‌, 3 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (27 బంతుల్లో 60; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరలెవెల్లో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

టిమ్‌ డేవిడ్‌ ఊచకోత ధాటికి ఇస్తామాబాద్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. షాదాబ్‌ ఖాన్‌ (4-1-26-2) ఒక్కడే పర్వాలేదనిపించాడు. అనంతరం బరిలోకి దిగిన ఇస్లామాబాద్‌.. సుల్తాన్స్‌ బ్యాటర్ల కంటే ఎక్కువగా రెచ్చిపోయి భారీ లక్ష్యాన్ని మరో బంతి మిగిలుండగానే (19.5 ఓవర్లలో 209/8) ఊదేశారు. ఇస్లామాబాద్‌ బ్యాటర్లు ​తలో చేయి వేసి తమ జట్టును గెలిపించుకున్నారు.

రహమానుల్లా గుర్భాజ్‌ (14 బంతుల్లో 25; 5 ఫోర్లు), కొలిన్‌ మున్రో (21 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), షాదాబ్‌ ఖాన్‌ (25 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆఖర్లో ఫహీమ్‌ అష్రాఫ్‌ (26 బంతుల్లో 51 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మద్‌ వసీం జూనియర్‌ (7 బంతుల్లో 16; ఫోర్‌, సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయంలో తమవంతు పాత్ర పోషించారు.

ఫలితంగా ఇస్లామాబాద్‌ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సుల్తాన్స్‌ బౌలర్లు అ‍న్వర్‌ అలీ (3/33), ఇహసానుల్లా (2/35), ఉసామా మీర్‌ (2/38) బంతితో ఓ మోస్తరుగా రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ పెషావర్‌ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్‌ తలపడనున్నాయి. 

కాగా,  ఇస్లామాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్‌ డేవిడ్‌ విధ్వంసాన్ని చూసిన ముంబై ఇండియన్స్‌ ఫ్యాన్స్‌ సంబురాల్లో మునిగి తేలుతున్నారు. భారీ కాయుడు ఇదే తరహా విధ్వంసాన్ని ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని వారు ఆశిస్తున్నారు. గత సీజన్‌లోనూ మెరుపులు మెరిపించిన టిమ్‌.. రాబోయే సీజన్‌లో మరింత రెచ్చిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ టిమ్‌ డేవిడ్‌ను 2022 ఐపీఎల్‌ మెగా వేలంలో ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  

>
మరిన్ని వార్తలు