WTC: కివీస్‌కు క్షమాపణలు చెప్పిన ఆసీస్‌ కెప్టెన్‌

26 Jun, 2021 12:45 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ న్యూజిలాండ్‌ జట్టుకు క్షమాపణలు చెప్పాడు. ఇటీవలే ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మొదలవ్వకముందు టీమిండియానే విజేతగా నిలుస్తుందని పైన్‌ అంచనా వేశాడు. కానీ అతని అంచనాలకు భిన్నంగా కివీస్‌ సూపర్‌ విక్టరీ సాధించి టెస్టు చాంపియన్‌గా అవతరించింది. ఈ నేపథ్యంలో కివీస్‌ను అభినందించిన పైన్‌ తన అంచనా తప్పినందుకు క్షమించాలంటూ న్యూజిలాండ్‌ను కోరాడు.

''ఒక్కోసారి మనం వేసుకునే అంచనాలు తప్పడం సహజమే. ఏడాదిన్నరగా టీమిండియా అద్భుత ఫామ్‌లో ఉండడంతో ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ను భారత్‌ గెలుస్తుందని అంచనా వేసుకున్నా. కానీ నేను అనుకున్నదానికంటే కివీస్‌ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. నిజానికి కివీస్‌​కు కీలక మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ద్వారా మంచి ప్రాక్టీస్‌ లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న విలియమ్సన్‌ సేన డబ్ల్యూటీసీ ఫైనల్లో అదరగొట్టింది. ఒక చిన్న ద్వీపంలా కనిపించే కివీస్‌ ఈ అద్భుత ఫీట్‌ను సాధించడం ఆనందంగా ఉంది. నా అంచనా తప్పినందుకు మరోసారి క్షమాపణ అడుగుతున్నా'' అంటూ ముగించాడు. ఇదే టిమ్‌ పైన్‌ గతంలో టీమిండియా ఆసీస్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ను గెలిచినప్పుడు.. టీమిండియా మమ్మల్ని మోసం చేసి సిరీస్‌ గెలిచిదంటూ  వివాదాస్పద కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఇక వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌లో న్యూజిలాండ్‌ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ జట్టు 2 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్‌ కాగా, న్యూజిలాండ్‌ 249 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. 139 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన కివీస్‌ జట్టు భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 

చదవండి: కోహ్లి.. ఇంకా ఎన్నాళ్లు ఈ నిరీక్షణ

టీమిండియా చీటింగ్‌ చేసి సిరీస్‌ గెలిచింది: పైన్‌

మరిన్ని వార్తలు