ప్రసిధ్‌ కృష్ణ ‘పాజిటివ్‌’

9 May, 2021 04:09 IST|Sakshi

న్యూజిలాండ్‌ క్రికెటర్‌ సీఫెర్ట్‌ కూడా

ముంబై: ఐపీఎల్‌ టి20 టోర్నీ వాయిదా పడిన తర్వాత మరో ఇద్దరు క్రికెటర్లు కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ ఇద్దరూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) బృందంలోని సభ్యులే. పేస్‌ బౌలర్‌ ప్రసిధ్‌ కృష్ణ, న్యూజిలాండ్‌కు చెందిన వికెట్‌ కీపర్‌ టిమ్‌ సీఫెర్ట్‌లకు కరోనా సోకినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ‘రెండు నెగెటివ్‌ ఫలితాలు వచ్చిన తర్వాత ఇతర భారత క్రికెటర్లలాగే ప్రసిధ్‌ కూడా మే 3న బబుల్‌ వీడాడు. అయితే స్వస్థలం బెంగళూరు చేరిన తర్వాత అతని రిపోర్టు పాజిటివ్‌గా వచ్చింది’ అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.

న్యూజిలాండ్‌కు చెందిన సీఫెర్ట్‌కు కూడా కరోనా రావడంతో అతను తన సహచర ఆటగాళ్లతో కలిసి ప్రత్యేక విమానంలో స్వదేశం వెళ్లే అవకాశం లేకుండా పోయింది. బయలుదేరే ముందు అతనికి చేసిన రెండు పరీక్షల్లో కూడా కరోనా ‘పాజిటివ్‌’ వచ్చింది. దాంతో సీఫెర్ట్‌ అహ్మదాబాద్‌లోనే ఆగిపోయాడు. సీఎస్‌కే బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ తరహాలోనే మెరుగైన చికిత్స కోసం సీఫెర్ట్‌ను కూడా చెన్నైకి తరలించనున్నారు. ఐసోలేషన్, ఆపై టెస్టులు నెగెటివ్‌గా వస్తేనే అతను న్యూజిలాండ్‌ పయనమవుతాడు. సీఫెర్ట్‌ ఆరోగ్యం గురించి తమకు పూర్తి సమాచారం ఉందని... బీసీసీఐతో పాటు అతను కోలుకునేందుకు తమవైపు నుంచి కూడా అన్ని రకాల సహకారం అందిస్తామని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవిడ్‌ వైట్‌ వ్యాఖ్యానించారు.  

ప్రసిధ్‌కు సాధ్యమేనా...
ఇంగ్లండ్‌ పర్యటనకు సెలక్టర్లు ప్రకటించిన నలుగురు రిజర్వ్‌ ఆటగాళ్లలో ప్రసిధ్‌ కృష్ణ ఒకడు. టీమిండియా బృందం ఈ నెల 25న ప్రత్యేక బయో బబుల్‌లోకి ప్రవేశిస్తుంది. ఆలోగా అతను నెగెటివ్‌గా తేలాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్‌ వెళ్లాల్సిన భారత క్రికెటర్లంతా కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకుంటే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన కోవిషీల్డ్‌ను తీసుకుంటే అది ఇంగ్లండ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి రెండో డోసు అక్కడా తీసుకోవచ్చనేది ఆలోచన. అయితే ప్రసిధ్‌ ఈ నెల 18 లేదా 20 వరకు నెగెటివ్‌గా తేలినా... వైద్య సూచనల ప్రకారం కరోనా నుంచి కోలుకున్న తర్వాత వ్యాక్సిన్‌కు కనీసం నాలుగు వారాల విరామం అవసరం. మరి ప్రసిధ్‌ విషయంలో బీసీసీఐ ఏం చేస్తుందనేది చూడాలి.

మరిన్ని వార్తలు