Tim Southee: ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న కివీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌

14 Apr, 2022 14:34 IST|Sakshi

Tim Southee Wins Sir Richard Hadlee Medal: న్యూజిలాండ్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ టిమ్ సౌథీ.. తన దేశ క్రికెట్‌కు సంబంధించి ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. 2021-22 సీజన్‌ ఆధ్యాంతం అద్భుతమైన ప్రదర్శన కనబర్చినందుకు గాను అతను సర్ రిచర్డ్ హ్యాడ్లీ పతకాన్ని గెలుచుకున్నాడు. సౌథీ తన 14 ఏళ్ల కెరీర్‌లో ఈ మెడల్‌ను గెలవడం ఇదే తొలిసారి. ఇవాళ (ఏప్రిల్‌ 14న) జరిగిన న్యూజిలాండ్‌ క్రికెట్‌ అవార్డుల కార్యక్రమంలో సౌథీ ఈ మెడల్‌తో పాటు 2022 సంవత్సరానికి గాను ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు.

సౌథీ 2021-22 సీజన్‌లో 23.88 సగటున 36 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్‌ ఫైనల్‌లో భారత్‌పై సాధించిన ఐదు వికెట్ల ఘనత కూడా ఉంది. సౌథీ.. న్యూజిలాండ్ టెస్ట్ ఛాంపియన్షిప్‌ సాధించడంలో తన వంతు పాత్ర పోషించడంతో పాటు గతేడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో తన జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలకంగా వ్యవహరించాడు. సౌథీ ఇటీవలి భారత పర్యటనలో న్యూజిలాండ్‌ జట్టుకు సారధిగా (కేన్ విలియమ్సన్ గైర్హాజరీలో) కూడా వ్యవహరించాడు. కెరీర్‌లో ఇప్పటివరకు 85 టెస్ట్‌లు, 143 వన్డేలు, 92 టీ20లు ఆడిన సౌథీ.. 639 వికెట్లతో పాటు 2697 పరుగులు సాధించాడు. 
చదవండి: వన్డేల్లో సరికొత్త రికార్డు.. 6 సిక్సర్లతో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టి నమోదు

మరిన్ని వార్తలు