మనిక–సత్యన్‌ జోడీకి టైటిల్‌

21 Aug, 2021 02:04 IST|Sakshi

డబ్ల్యూటీటీ కంటెండర్‌ టోర్నీ  

బుడాపెస్ట్‌ (హంగేరి): టోక్యో ఒలింపిక్స్‌లో ఎదురైన నిరాశ నుంచి భారత స్టార్‌ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారులు మనిక బాత్రా, సత్యన్‌ త్వరగానే బయటపడ్డారు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) కంటెండర్‌ టోర్నీలో జోడీ కట్టిన మనిక–సత్యన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో టైటిల్‌ చేజిక్కించుకున్నా. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత జోడీ 3–1 (11–9, 9–11, 12–10, 11–6)తో ఆతిథ్య హంగేరీకి చెందిన 94వ ర్యాంక్‌  డోర మదరస్జ్‌–నండోర్‌ ఎక్సెకీ జంటపై గెలుపొందింది.  

సింగిల్స్‌ సెమీస్‌లో అవుట్‌
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో విజయవంతమైన మనిక సింగిల్స్‌లో నిరాశపరిచింది. మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 60వ ర్యాంకర్‌ మనిక బాత్రా 0–4 (10–12, 9–11, 10–12, 8–11)తో ఎలిజబెత్‌ అబ్రామియెన్‌ (రష్యా) చేతిలో కంగుతిన్నది. ఏకంగా 415వ ర్యాంకర్‌ చేతిలో అది కూడా ఒక్క గేమ్‌ కూడా గెలవకుండా మనిక పరాజయం చవిచూడటం గమనార్హం. పురుషుల సింగిల్స్‌లో సత్యన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ఓడిపోయాడు.

మరిన్ని వార్తలు