Laureus Sports Awards 2022: మరో ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నీరజ్‌ చోప్రా

2 Feb, 2022 18:08 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక లారెస్‌ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. మొత్తం ఏడు విభాగాల్లో వివిధ క్రీడలకు చెందిన ఆటగాళ్లను లారెస్‌ స్పోర్ట్స్‌ అవార్డుకు నామినేట్‌ చేశారు. కాగా 2022 లారెస్‌ స్పోర్ట్స్‌ వరల్డ్‌ బ్రేక్‌త్రూ అవార్డుకు నీరజ్‌ చోప్రా సహా మరో ఐదుగురు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు.

రష్యన్‌ టెన్నిస్‌ స్టార్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రన్నరప్‌ డానియెల్‌ మెద్వెదెవ్‌, స్పానిష్‌ ఫుట్‌బాలర్‌ పెడ్రీ, బ్రిటన్‌ టెన్నిస్‌స్టార్‌ ఎమ్మా రాడుక్కాను, వెనిజులా అథ్లెట్ యులిమర్ రోజస్ తోపాటు ఆసీస్ స్విమ్మర్ అరియార్నే టిట్మస్‌లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1300 మంది స్పోర్ట్స్‌ జర్నలిస్టులు ప్రతిష్టాత్మక అవార్డుకు ఏడు కేటగిరీ నుంచి ఆటగాళ్లను నామినేట్‌ చేశారు. ఓటింగ్‌ ప్రక్రియ ద్వారా ఏప్రిల్‌లో అవార్డు విజేతలను ప్రకటించనున్నారు. ఇక ఇప్పటికే నీరజ్‌ చోప్రా దేశ అత్యున్నత క్రీడా పురస్కారం, మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుతో పాటు ఇటీవలే పద్మశ్రీ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే.

కాగా ప్రతిష్టాత్మక లారెస్‌ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు నామినేషన్స్ కు భారత్ తరఫున ఎంపికైన మూడో అథ్లెట్ నీరజ్ చోప్రా కావడం గమనార్హం. ఇంతకు ముందు ఈ అవార్డు నామినేషన్స్ కు 2019లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఎంపికవ్వగా.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా లారెస్‌ స్పోర్ట్స్‌ అవార్డ్‌ నామినేషన్స్కు సెలెక్ట్ అయ్యాడు. 2000–2020 కాలానికి గానూ ప్రకటించిన లారెస్‌ స్పోర్టింగ్ మూమెంట్ అవార్డును సచిన్ గెలుచుకోవడం విశేషం. 

మరిన్ని వార్తలు