Tokyo Olympics: మీరాబాయి 'రజతం' ; ఇంట్లో సంబురాలు.. వీడియో వైరల్‌

24 Jul, 2021 13:32 IST|Sakshi

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను రజతం సాధించి చరిత్ర సృష్టించింది.  ఈ సందర్భంగా మీరాబాయి స్వస్థలం మణిపూర్‌లోని ఆమె నివాసంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె వెయిట్‌లిఫ్టింగ్‌లో జెర్క్‌ అండ్‌ క్లీన్‌ కేటగిరీలో మూడో రౌండ్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో విఫలమైనప్పటికి అప్పటికే ఆమెకు పతకం ఖాయమైంది. దీంతో మీరాబాయి చాను కుటుంబసభ్యులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.

కాగా 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి క్యాంస్య పతకం తర్వాత ఆ విభాగంలో పతకం రావడం మళ్లీ ఇదే కావడం విశేషం. 2016 రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం పడినప్పటికి ఆమె ఫెయిల్‌ అయ్యింది. అయితే తన ప్రదర్శనతో నిరాశ చెందని మీరాబాయి 2017లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి.. రెండు దశాబ్దాల తర్వాత ఆ ఫీట్‌ను సాధించిన ఇండియన్‌ వెయిట్‌లిఫ్టర్‌గా నిలిచింది. ఇది ఆమె కెరీర్‌లో ఓ మైలురాయి అనుకోవచ్చు.

2018 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం, 2019లో ఏషియన్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యంతో మెప్పించింది. ఆపై 2020లో సీనియర్‌ నేషనల్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో తన రికార్డును తానే బద్ధలు కొట్టి స్వర్ణంతో మెరుగైన ఫలితంలో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది మీరాబాయి చాను స్నాచ్‌లో 87 కేజీలు ,  క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్‌ ఎత్తింది.మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. దాంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.210 కేజీలు ఎత్తి చైనా లిఫ్టర్‌ జిజోయ్‌ పసిడిని దక్కించుకున్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

మరిన్ని వార్తలు