Aditi Ashok: కోట్ల మందికి గోల్ఫ్‌ మజా.. టాప్‌ ప్లేయర్లకు ముచ్చెమటలు

7 Aug, 2021 11:02 IST|Sakshi

గోల్ఫ్‌ 

క్రీడాభిమానుల గుండె వేగం పెంచే ఆట క్రికెట్‌ ఒక్కటేనా?.. ఛా.. ఛా.. ఈసారి ఒలింపిక్స్‌లో అలాంటి క్షణాలు చాలానే కనిపించాయి. క్వార్టర్స్‌, సెమీస్‌, ఫైనల్‌.. అంటూ హాకీ, బాక్సింగ్‌, రెజ్లింగ్‌.. ఆఖరికి రూల్స్‌పై కూడా సరిగా అవగాహనా- ఆటపై అంతగా ఆసక్తి సైతం లేని గోల్ఫ్‌ను సైతం కోట్ల భారతావనిని ఆసక్తిగా తిలకించేలా చేశారు మన ఆటగాళ్లు. అలాంటి ఉత్కంఠంతో చివరిదాకా మ్యాచ్‌ను కొనసాగించి.. ఓడినా చరిత్ర సృష్టించింది భారత యువగోల్ఫర్‌ అదితి అశోక్‌ . 

సాక్షి, వెబ్‌డెస్క్‌: ఆటల్లో రిచ్చెస్ట్‌ గేమ్‌గా గోల్ఫ్‌కు ఓ పేరుంది. అలాంటి ఆటలో.. అదీ ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారి ఫైనల్‌దాకా చేరుకుని భారత్‌కు పతాక ఆశలు చిగురింపజేసింది 23 ఏళ్ల అదితి. టోక్యో ఒలింపిక్స్‌కి ముందు.. ప్రారంభమైన తర్వాతా పతకాన్ని తెస్తారనే ఆశలు ఉన్న పేర్ల లిస్ట్‌లో అదితి పేరు కనీసం ఏదో ఒక మూలన కూడా లేదు. కారణం.. మహిళా గోల్ఫ్‌ ర్యాకింగ్స్‌లో ఆమెది 200వ ర్యాంక్‌. అలా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. పతాక పోరు దాకా అదితి చేరుకోవడం, ఆ పోరాటంలో ఓడి కోట్ల మంది హృదయాలను గెల్చుకోవడం ప్రత్యేకమనే చెప్పాలి. 

బెంగళూరుకు చెందిన అదితి అశోక్‌.. టోక్యో ఒలింపిక్స్‌లో నిన్నటి పొజిషన్‌లో(మూడో రౌండ్‌) రెండో స్థానంలో నిలవగా.. అదృష్టం బావుండి ఇవాళ్టి వాతావరణం బాగోలేకపోతే దాదాపు పతాకం ఖాయమయ్యేదే. అయితే శనివారం ఉదయం సైటమాలోని కాసుమిగాసెకి కౌంట్రీ క్లబ్‌లో జరిగిన ఫైనల్‌ గేమ్‌ రసవత్తరంగా నడిచింది. అయినా అతిది అద్భుతమైన ఆట తీరును కనబరిచింది. టాప్‌ పొజిషన్‌లో నిలిచి ఒకానొక టైంలో అభిమానుల్లో స్వర్ణం ఆశలు రేకెత్తించి ఉత్కంఠ పెంచిన అదితి.. ఆపై రెండు, మూడు.. చివరికి స్వీయ తప్పిదం-ప్రత్యర్థులకు కలిసి రావడంతో నాలుగో స్థానానికి సెటిల్‌ అయ్యింది. పతకం దక్కించుకోకపోతేనేం.. గోల్ఫ్‌ ఆటలోనూ అసలైన మజాను కోట్ల మంది భారతీయులకు రుచి చూపించింది అదితి.

ఇక రియో ఒలింపిక్స్‌లో 41 వ స్థానంలో టైతో నిష్క్రమించిన అదితి అశోక్‌.. ఈసారి ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా ఫైనల్‌ దాకా దూసుకెళ్లడం విశేషం. క్యాడీగా(గోల్ఫ్‌ బ్యాగులు మోస్తూ సాయం చేసే వ్యక్తి) తల్లి వెంటరాగా.. 200వ ర్యాంక్‌తో బరిలోకి దిగిన ఈ యువ కెరటం ప్రపంచ నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ నెల్లీ కోర్డా, మాజీ ఛాంపియన్‌ లైడియా కో(11), ఎమిటీ క్రిస్టియన్‌(72), మోన్‌ ఇనామీ(28)మధ్య గట్టి పోటీ ఇస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఒకానొక దశలో ప్రపంచ నెంబర్‌ వన్‌, మాజీ నెంబర్‌ వన్‌లకు ముచ్చెమటలు పోయించింది ఈ భారత గోల్ఫ్‌ ప్లేయర్‌. 

చదవండి: భారత హాకీ: పతాకం నుంచి పతనం.. ఆపై పతకం


గోల్ఫ్‌ ఆట తీరు అర్థంకాకపోయినా.. అదితి ఆడుతున్నంతసేపూ ఉత్కంఠను తట్టుకోలేకపోయారు యావత్‌ భారత క్రీడాభిమానులు. గోల్ఫ్‌ అంటే ఆసక్తి లేనోళ్లను.. సైతం శనివారం పొద్దుపొద్దున్నే టీవీలకు, సెల్‌పోన్లకు అతుక్కుపోయేలా చేసింది అదితి అశోక్‌. అంతేకాదు కొందరిని ఆటలోని పదాలను, ఆట తీరును అర్థం చేసుకునేలా చేసింది.  ఇక ఒలింపిక్‌ జాబితాలో పీటీ ఉష, దీపా కర్మాకర్‌, ఈ ఒలింపిక్స్‌లో ఉమెన్స్‌ హాకీ టీం.. ఇప్పుడు అదితి అశోక్‌.. ఇలా ఫోర్త్‌ సెటిల్‌ సెంటిమెంట్‌(తృటిలో పతకం చేజార్చుకున్న ఆటగాళ్ల) ప్రస్తావనను మరోసారి తెర మీదకు తెచ్చింది.

మరిన్ని వార్తలు