Tokyo Olympics 2020: మరేం పర్లేదు సింధు.. ఓడినా

31 Jul, 2021 17:31 IST|Sakshi

హైదరాబాద్‌: రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన షట్లర్‌.. రెండేళ్ల క్రితం ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌గా నిలిచిన తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు.. ఈసారి ఎలాగైన విశ్వ క్రీడల్లో సత్తా చాటి స్వర్ణం సాధిస్తుందని అభిమానులు ఆశించారు. టోక్యో ఒలింపిక్స్‌ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టగానే విజయం ఖాయమని మురిసిపోయారు. అయితే, వరల్డ్‌ నెంబర్‌ వన్‌, చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తైజుయింగ్‌ పీవీ సింధు విజయపరంపరకు బ్రేక్‌ వేసింది. తొలి గేమ్‌లో మొదట్లో సింధు ఆధిక్యం కనబరిచినా, వెంటనే తేరుకున్న తైజు.. వరుస గేమ్‌లలో ఆమెను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది.

దీంతో సగటు భారతీయ అభిమానులంతా నిరాశలో కూరుకుపోయారు. అయితే, ఇంతవరకు సింధు సాగించిన పోరాటాన్ని కీర్తిస్తూ... ‘‘మరేం పర్లేదు సింధు... ఓడినా.. మా మనసులు గెలిచావు. వరుస ఒలింపిక్స్‌లో సెమీస్‌ చేరిన నీ సత్తా ఏమిటో మాకు తెలుసు. ఆటలో గెలుపోటములు సహజం. ఏదేమైనా నువ్వు ఎల్లప్పుడూ చాంపియన్‌వే. నీ గెలుపును చూసి గర్వించాం. నీ ఓటమిలోనూ వెన్నంటే ఉంటాం’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రేమను చాటుకుంటున్నారు. పలువురు ప్రముఖులు సైతం పీవీ సింధు గతంలో సాధించిన విజయాలను కొనియాడుతూ.. తదుపరి మ్యాచ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.

నువ్వు ఎప్పుడూ మాకు గర్వకారణమే
‘‘బాధపడాల్సిన అవసరం లేదు సింధు. నీ విజయాలను చూసి భారత్‌ ఎల్లప్పుడూ గర్విస్తుంది. కచ్చితంగా నువ్వు మెడల్‌తోనే తిరిగి వస్తావు. కాంస్య పతకం నెగ్గేందుకు జరిగే మ్యాచ్‌లో గెలవాలని ఆశిస్తున్నా’’ అని కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్‌ రిజిజు ట్విటర్‌ వేదికగా తన స్పందన తెలియజేశారు. పీవీ సింధుకు మద్దతుగా నిలిచారు.


 

మరిన్ని వార్తలు